పోక్సోకు మించిన ప్రత్యేక చట్టం... ఏపి మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

బుధవారం, 22 సెప్టెంబరు 2021 (18:14 IST)
కంచె చేను మేసిన‌ట్లు... క‌న్న తండ్రులే లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్న ఘ‌ట‌న‌లు క‌ల‌చివేస్తున్నాయి. మాన‌వ మృగాల కోర‌ల‌కు బ‌ల‌వుతున్న బాలిక‌ల‌ను ఆదుకునేందుకు చ‌ట్టాలు మ‌రింత క‌ఠినం కావాల్సిన ఆవ‌శ్య‌కత‌ను ఎత్తిచూపుతున్నాయి. పోక్సోకు మించిన ప్రత్యేక చట్టంతోనే లైంగిక వేధింపుల‌ను అరిక‌ట్టే య‌త్నం చేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం భావిస్తోంది.  కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన క‌న్న తండ్రులే అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్న ఘ‌ట‌న‌ల‌పై, బాలిక‌లపై వేధింపుల‌పై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. 
 
బాలికలపై కన్నతండ్రులే అఘాయిత్యాలకు పాల్ప‌డ‌టాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఏపి మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. విజ‌య‌వాడ‌లో పోషకాహార మాసోత్సవాల సందర్భంగా జిల్లా జైలును సందర్శించిన ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన స్వ‌గృహ‌మే, కారాగారంలా, లైంగిక‌ వేధింపుల‌కు నిల‌యంగా మార‌డం దారుణ‌మ‌ని, మహిళలకు ఇంటి వాతావరణంలో కూడా భద్రత లేని పరిస్థితులను తీవ్రంగానే పరిగణించాల్సి వస్తుందన్నారు. ఈ విషయంలో పోక్సోకు మించిన ప్రత్యేక కఠిన చట్టం తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఇటీవల మహిళా సమస్యలను కొందరు రాజకీయాలకు వాడుకోవాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని, ప‌రోక్షంగా టీడీపీ నేత‌ల‌పై  వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. రాజకీయంగా బురద చల్లుకోవడం కాకుండా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఉమ్మడిగా పోరాడాలని పిలుపునిచ్చారు.
 
ప్రభుత్వాల కృషి కారణంగా మహిళలు అన్ని రంగాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నారని, అదే స‌మ‌యంలో మహిళలపై జరుగుతున్న నేరాలు రేటు పెరుగుతోంద‌న్నారు. ఇలాంటి పరిస్థితిపై అధ్యయనం చేస్తూ, నివారణ చర్యలు చేపట్టడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందంజలో ఉందని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలతో పోల్చుకుంటే, ప్రస్తుతం రాష్ర్టంలో మహిళా సాధికారత, భద్రత బాగుందని అన్నారు.  మహిళలు, యువతులు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా రాజకీయాలకతీతంగా అధికార, విపక్షాలు ఉమ్మడిగా పోరాటం చేయాలని మహిళ కమిషన్ పిలుపునిస్తుందన్నారు.
 
ఇటీవ‌ల సామాజిక రుగ్మతగా మారిన, మహిళల సమస్యలపై మహిళ కమిషన్ దృష్టి పెట్టిందన్నారు. అందుకే బాలికల విద్యపై  నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. అసంఘటిత రంగంలో మహిళలపై జరిగే లైంగిక వేధింపులపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. బాలికలపై అఘాయిత్యాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాధితులకు సాయమందివ్వడంలో ప్రభుత్వం దృష్టికి రాని అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు అన్ని యూనివర్సిటీలలో 'ఈ-నారీ' వెబినార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా మహిళా సాధికారత సాధించడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఏపి మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వివ‌రించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు