టీడీపీకి షాక్.. ఆ నలుగురు బీజేపీ గోడ దూకారు.. బాబు పరిస్థితి?

గురువారం, 20 జూన్ 2019 (19:13 IST)
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాలేకపోయిన టీడీపీలో వుండి చేసేదేమీ లేదనుకున్న ఆ నలుగురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధికారంలో వుండగా కీలక నేతలుగా వ్యవహరించి ఆ నేతలు ప్రస్తుతం గోడ మీద పిల్లిలా బీజేపీలో చేరిపోయారు. దీంతో తెదేపాకు షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు తెదేపాను వీడుతున్నట్లు ప్రకటించారు. 
 
ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. తమను ప్రత్యేకమైన గ్రూప్‌గా పరిగణించాలంటూ ఎంపీలు సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌ రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ అందజేశారు. తెదేపాను విభేదించి బయటకు వచ్చామని.. ఆ పార్టీతో ఇకపై తమకు ఎలాంటి సంబంధం లేదని రాజ్యసభ ఛైర్మన్‌కు అందజేసిన లేఖలో ఎంపీలు పేర్కొన్నారు. 
 
తెదేపా నుంచి మాత్రమే తాము దూరమయ్యామని.. ఎంపీలుగా మిగిలిన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని ఎంపీలు తమ లేఖలో వివరించారు. నలుగురు ఎంపీల రాజీనామాతో రాజ్యసభలో తెదేపా బలం రెండుకు పడిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్‌ మాత్రమే మిగిలారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు