చిత్తూరు జిల్లాను వణికిస్తున్న బ్లాక్ ఫంగస్, బోయకొండ ఆలయ ప్రధాన అర్చకుడికి...

గురువారం, 20 మే 2021 (22:24 IST)
ఒకవైపు కరోనా.. మరోవైపు బ్లాక్ ఫంగస్. ఇలా రెండూ చిత్తూరు జిల్లా ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో పాటు మృతుల సంఖ్య అదేస్థాయిలో ఉండడంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. దీంతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు వస్తుండడం ప్రజలను మరింత భయాందోళనకు గురవుతున్నారు.
 
కరోనా కేసులు ప్రతిరోజు 3వేలకు చేరువలో ఉంటున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కేసులన్నీ ఆ స్థాయిలో ఉంటే ఒక్కతిరుపతిలోనే 1000 కరోనా కేసులు నమోదవుతున్నాయి.  కరోనా నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచనలో ఉంటే బ్లాక్ ఫంగస్ మరింత భయపెడుతోంది. ఇప్పటికే జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి.
 
ప్రధానంగా ఈ బ్లాక్ ఫంగస్ స్టెరాయిడ్ వాడకం వల్ల, షుగర్ వ్యాధిని పట్టించుకోకపోవడం వల్ల వస్తోందని వైద్యులు నిర్థారించారు. కలికిరిలో ఒక  మహిళకు లక్షణాలుంటే తిరుపతిలోని ప్రభుత్వ రుయా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అలాగే మరో వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకడంతో అదే వార్డులో ఉంచారు. ప్రత్యేకంగా రుయాలో బ్లాక్ ఫంగస్ వార్డును ఏర్పాటు చేశారు.
 
ఇదిలా ఉంటే బోయకొండ ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మణాచార్యులకు బ్లాక్ ఫంగస్ సోకింది. దీంతో మూడురోజులకు ముందు తిరుపతికి తీసుకొచ్చి ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తీసుకెళ్ళారు. కానీ అక్కడ ఆయన్ను చేర్చుకోకపోవడంతో తిరిగి తిరుపతిలోనే చేర్పించాలని నిర్ణయించుకుని తిరుపతికి తీసుకొస్తున్నారు. 
 
అయితే ఇది అంటు వ్యాధి కాదని వైద్యులు నిర్థారిస్తున్నారు. కరోనా రాకుండా ఏ విధంగా అప్రమత్తంగా ఉంటామో బ్లాక్ ఫంగస్ పైన కూడా అదేవిధంగా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. షుగర్ ఎక్కువగా ఉంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలని, స్టైరాయిడ్‌లు వాడటం మానుకోవాలంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు