రాయలసీమను సస్యశ్యామలం చేస్తా.. తోక జాడిస్తే కట్ చేస్తా: చంద్రబాబు

శనివారం, 7 మే 2016 (18:10 IST)
రాయలసీమను సస్యశ్యామలం చేసేంతవరకు రాత్రింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురవళ్లిలో కాల్వలను పరిశీలించిన సీఎం చెరువు పూడికతీత పనులను ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... నీరు-ప్రగతి ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నీరు లేకపోతే మానవ మనుగడ కష్టమన్నారు. 
 
అన్ని గ్రామాల్లో చెరువుల మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టాలని చంద్రబాబు కోరారు. పంటసంజీవని కింద ప్రతి ఒక్క పొలంలో పంటకుంటలు తవ్వాలని.. దీని ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. మరోవైపు కావలి మున్సిపల్‌ ఛైర్మన్‌ దాడి ఘటనపై చంద్రబాబు మండిపడ్డారు. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని.. వ్యక్తిగత ఘర్షణలు పక్కనబెట్టాలని సూచించారు.
 
మరోవైపు విజయవాడ పరిధిలో జరిగిన నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు విపక్షంపై విమర్శలు గుప్పించారు. ఏపీకి వెన్నుపోటు పొడిచానని పనిగట్టుకుని కొన్ని పత్రికల్లో తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి పనికి అడ్డు తగులుతున్నారని వైసీపీని దుయ్యబట్టారు.

వట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో సహా ఆఖరికి అమరావతి నిర్మాణానికి కూడా అడ్డు తగలడం దారుణమన్నారు. కాపుల ఉద్యమం ఉద్రిక్తలకు దారితీయడానికి కారణం కూడా వైసీపీయే చంద్రబాబు ఆరోపించారు. ఎవరైనా సరే తోక జాడించాలని చూస్తే కట్ చేస్తానంటూ హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి