ప్రకృతివైపరీత్యాలతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకే రైతు రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం కడప జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... ఉద్యానవన రైతులకు రూ.384.47 కోట్ల రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ రుణమాఫీ పథకం ద్వారా 2.23 లక్షలమంది ఉద్యానవన రైతులు లబ్ది పొందనున్నారని తెలిపారు. రైతులకు న్యాయం చేసేందుకే రుణమాఫీ పథకాన్ని ప్రవేవపెట్టినట్లు చెప్పారు. రుణమాఫీపై విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు.
పులివెందులలో ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామన్నారు. పండ్ల తోటల వల్ల రైతుకు మంచి ఆదాయం వస్తుందని, వ్యవసాయం చేసిన వారికంటే పండ్ల తోటలు వేసిన వారి ఆదాయం ఎక్కువ అని చెప్పారు. వ్యవసాయం కంటే ఉద్యాన పంటల్లో 12 రెట్లు ఎక్కువ ఆదాయం వస్తుందని ఆయన గుర్తు చేశారు.