నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఒకవేళ హోదా ఇవ్వలేని పక్షంలో ఇతర రూపంల సాయం చేయాలని రాపోలు ఆనంద భాస్కర్, ఎంఏ ఖాన్ కోరారు.
ధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో మరోసారి చర్చ శుక్రవారం మధ్యహ్నం 2:30 గంటలకు ప్రారంభమైంది. చర్చలో ఆనంద భాస్కర్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే మరో రూపంలో సాయం చేయాలని కోరారు. విభజన వల్ల రెండు రాష్ట్రాలకు లాభం కలిగిందని, రెండు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఆర్థిక లోటు వల్ల ఏపీ ఇబ్బందుల్లో ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హామీలను అమలు చేయలేమని వెంకయ్య చెప్పారని... వెంకయ్య అధికారంలో ఉన్నప్పుడు ఒకలా... అధికారంలో లేనప్పుడు మరోలా మాట్లాడుతున్నారని రాపోలు మండిపడ్డారు.
అలాగే మరో ఎంపీ ఎంఏ ఖాన్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ఏపీకి హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, ఏపీకి న్యాయం చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం బాధాకరమని ఖాన్ విచారం వ్యక్తం చేశారు.