బంగారు బాతును చంపేస్తున్నారు : అమరావతిపై భవిష్యత్‌పై బాబు ఆవేదన

శనివారం, 21 డిశెంబరు 2019 (12:27 IST)
అమరావతి భవిష్యత్‌పై అంధకారం నెలకొనివుండటంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారు బాతులాంటి రాజధాని అమరావతిని చంపేస్తున్నారంటూ మండిపడ్డారు. అమరావతి విధ్వంసానికి కుట్ర సాగుతోందని విరుచుకుపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలిగానీ పరిపాలన వికేంద్రీకరణ సరికాదని తేల్చిచెప్పారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు 151 సీట్లు వచ్చాయని సీఎం జగన్‌కు ఒళ్లంతా గర్వమని విమర్శించారు. టీడీపీకి కూడా ఉమ్మడి రాష్ట్రంలో 200కి పైగాసీట్లు వచ్చాయని.. కానీ తాము చాలా హుందాగా వ్యవహరించామని తెలిపారు. అనంతపురం జిల్లాలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా చివరిరోజు చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. తన హయాంలో కొత్త రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి దిశగా తీసుకెళితే వైసీపీ నేతలు అవినీతి అన్నారని మండిపడ్డారు. తన పాలనలో తప్పు జరిగి ఉంటే నిరూపించాలని సవాల్‌ విసిరారు.
 
అడ్డదిడ్డమైన మాటలు కట్టిపెట్టాలన్నారు. ఈ ఆరునెలల కాలంలో జగన్‌ ప్రజలకేం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం.. పరిపాలన గందరగోళం అంటూ ఎద్దేవాచేశారు. టీడీపీ హయాంలో జిల్లాలవారీగా అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చేలా ఏర్పాట్లు చేశామని, ఇప్పుడవన్నీ వెనక్కి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరో పక్క రాష్ట్రానికి రావలసిన పెట్టుబడులు కూడా వెనక్కి పోయాయని చెప్పారు. 
 
జగన్‌ ఏలుబడిలో రైతులకు పంటల గిట్టుబాటు ధరలు లేవన్నారు. ఉల్లి ఘాటెక్కిందని, నిత్యావసర ధరలు పెరిగాయని, ఇసుక ప్రియమైందని తెలిపారు. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే డబ్బులడగడంతో జాకీ కంపెనీ వెనక్కి పోయింది. ఈ జిల్లాను ఆటోమొబైల్‌ హబ్‌గా, కర్నూలును పారిశ్రామిక హబ్‌గా, విశాఖను నాలెడ్జ్‌ హబ్‌గా రూపుదిద్దడానికి నేను అన్ని ఏర్పాట్లూ చేశాను. అమరావతికి పలు వ్యాపారసంస్థలు, హోట ళ్లు, షాపింగ్‌మాళ్ల వంటివి తీసుకొచ్చాం. అలాంటి అభివృద్ధిని మేం ఎంచుకుంటే దానిని అవినీతిగా చిత్రీకరిస్తారా అని చంద్రబాబు ధ్వజమెత్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు