హైదరాబాద్ నుంచి అమ‌రావ‌తికి వచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి నిలిపివేత

శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (11:49 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు ప్ర‌భుత్వం క‌ల్పించిన రాయితీల‌ను ఒక్కొక్క‌టి ఉప‌సంహ‌రిస్తోంది. విభ‌జ‌న జ‌రిగి ఎనిమిదేళ్ళు కావ‌స్తున్నా... ఇంకా ఉద్యోగుల‌కు ఉచిత వ‌స‌తి ఎందుకుని వైసీపీ ప్ర‌భుత్వం భావించిన‌ట్లుంది. అందుకే హైద‌రాబాదు నుంచి వ‌చ్చిన ఉద్యోగుల‌కు నవంబరు 1 నుంచి ఉచిత వసతి నిలిపివేస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
సచివాలయం, మండలి, హెచ్ఓడీ విభాగాల ఉద్యోగులకు వసతిని నిలిపేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  నవంబరు 1 నుంచి వసతి ఖర్చును ఉద్యోగులే భరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు వారికి షేరింగ్ ప్రాతిపదికన ప్రభుత్వం ఉచిత వసతి కల్పించింది. ఇక ఇక్క‌డి ఉద్యోగానికి రావడం వారి విధి అని, దీనికి ప్ర‌త్యేకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వ‌స‌తి క‌ల్పించాల్సిన అవ‌స‌రం లేద‌ని భావిస్తున్నారు.

పైగా, నిత్యం హైద‌రాబాదు నుంచి విజ‌య‌వాడ‌కు, అక్క‌డి నుంచి అమ‌రావ‌తికి ఉద్యోగులు అప్ అండ్ డౌన్ చేయ‌డం కూడా మంచిది కాద‌ని అధికారులు సూచిస్తున్నారు. అమ‌రావ‌తి ఉద్యోగులంతా స్థానికంగా ఉండి విధుల‌కు హాజ‌రుకావాల‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు కోరుతున్నారు. ఇక దీనిపై ఏపీ సెక్ర‌టేరియేట్ ఉద్యోగులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు