పిల్లలు పుట్టాలంటే.. తండ్రి లేదా పినతండ్రితో గడుపు.. తప్పులేదు : భార్యపై భర్త ఒత్తిడి

గురువారం, 16 మార్చి 2017 (17:12 IST)
హైదరాబాద్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. సంతానం కలగాలంటే తన నాన్న, చిన్నాన్నలతో గడపాలని ఓ భార్యను ఆమె భర్తే ఒత్తిడి చేశాడు. ఆ పని చేసేందుకు అంగీకరించిన ఆ బాధితురాలి పోలీసులను ఆశ్రయించి.. ఆ దుర్మార్గులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సంతోష్‌నగర్‌ మోయిన్‌బాగ్‌కు చెందిన మహిళకు(23)కు ఈదిబజార్‌కు చెందిన ముజమిల్‌ మునీర్‌(26)తో గత సెప్టెంబర్‌లో వివాహం జరిగింది. మునీర్‌ తల్లిదండ్రులు సౌదీ అరేబియాలో ఉంటుండగా, అతని చిన్నాన్న ముబీనోద్దీన్‌(45) చంచల్‌గూడలో నివశిస్తున్నాడు. అప్పుడప్పుడు ఈదిబజార్‌కు వచ్చే ముబీనోద్దీన్‌ వరుసకు కుమారుడైన మునీర్‌ భార్యపై కన్నేశాడు. 
 
ఈ క్రమంలోనే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో బాధితురాలు ఈ విషయాన్ని భర్త మునీర్, అత్త, మామలకు దృష్టికి తీసుకెళ్లింది. అయితే వారు అతడిని మందలించకపోగా ఇలాంటి విషయాలు బయట చెప్పుకుంటే పరువు పోతుందని, సంతానం కోసం అతను చెప్పినట్లు నడుచుకోవాలని సూచించారు.
 
బాధితురాలికి ఆమె భర్త మునీర్‌ అండగా నిలవకపోగా 'నీకు సంతానం కలగాలంటే తన తండ్రి లేదా పినతండ్రితో గడపాలంటూ భార్యపై ఒత్తిడి చేశాడు. దీనిని అలుసుగా తీసుకున్న ముబీనోద్దీన్‌ మరింత రెచ్చిపోయి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. మార్చి 6న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు ముబీనోద్దీన్. ఈ క్రమంలో బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకుని పుట్టింటికి వెళ్లింది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోష్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
వారు ఏమాత్రం పట్టించుకోక పోవడంతో బాధితురాలు మంగళవారం రాత్రి దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. కేసు నమోదు చేసి విచారణ జరపాలని డీసీపీ ఆదేశించడంతో పోలీసులు మునీర్, ముబీనోద్దీన్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి