నాచారంలోని హెచ్‌ఎంటీ నగర్‌కు చెందిన మహిళ స్థానిక దుర్గామాత ఆలయానికి క్రమంతప్పకుండా వెళుతుండేది. భక్తితో తరచుగా ఆలయానికి వెళ్లడంతో ఆలయ పూజారి శ్రీరామ్ శర్మతో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమె వ్యాపారంలో నష్టం వచ్చిందని, ఏం చేస్తే నష్టాల నుంచి బయటపడవచ్చని ఆమె శ్రీరామ్ శర్మను సలహా అడిగింది.
దీనిని అవకాశంగా తీసుకున్న ఆయన వ్యూహం రచించాడు. దీంతో తాను చెప్పిన పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయని నమ్మించాడు. ఈనెల 14న ఆమె ఇంటికి వెళ్లి పూజ నిర్వహించాడు. పూజ సమయంలో తాను, ఆమె మాత్రమే ఉండాలని చెప్పడంతో ఆమె భర్త, కుమారుడు ఇంటి బయట ఉన్నారు. ఇంతలో ఇంట్లోనుంచి ఆమె అరుపులు వినిపించడంతో వారిద్దరూ లోపలికి వెళ్లారు. అక్కడ జరిగినది చూసి, పూజారికి దేహశుద్ధి చేశారు.
ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాచారం పోలీసులు శ్రీరామ్ శర్మపై ఐపీసీ సెక్షన్లు 354, 420 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పూజారి మాటలు నమ్మి ప్రత్యేక పూజలకు అంగీకరించామనీ, కానీ అతను ఇలా చేస్తాడని తాము కలలో కూడా ఊహించలేదనీ బాధితురాలు వాపోయింది.