'లడ్డూ కావాలా బాబూ' అంటూ గుర్తు తెలియని నంబరు నుంచి ఓ వాట్సాప్ సందేశం వస్తుంది. ఆ సందేశాన్ని ఓపెన్ చేస్తే ఓ అందమైన అమ్మాయి ఫోటో.. దానికి కిందనే గంటకు రూ.3 వేలు.. రాత్రికి రూ.7 వేలు అని ఉంటుంది. ఆ తర్వాత దానికింద మొబైల్ నంబర్. ఆశపడి ఫోన్ చేస్తే మాత్రం బుక్ అయినట్టే. హైదరాబాద్ నగరంలో ఓ వగలాడి మాయలో పడి అనేక మంది యువకులు డబ్బు పోగొట్టుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
ఓ మాయలేడి పంపించే ఫోటోను చూడగానే సొంగకార్చుకుని ఎంజాయ్ చేద్దామని భావిస్తే మాత్రం మోసపోయినట్టే. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎంజాయ్ చేద్దామని భావించి, ఆ డబ్బును జమ చేయగానే, గూగుల్ మ్యాప్స్ ఆధారంగా బేగంపేటలోని ఓ లొకేషన్ షేర్ అవుతుంది. సదరు అపార్టుమెంట్‌లోని ఫలానా ఫ్లోర్‌కు వెళ్లాలని, ఏ తలుపు తీసుంటే దానిలోకి నిర్భయంగా రావాలని చెబుతుంది. ఇక అక్కడికి వెళ్లిన వారు, తాము ఫ్యామిలీస్ ఉంటున్న అపార్టుమెంట్‌కు వచ్చామని, మోసపోయామని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టదు. ఈ క్రమంలో వాగ్వాదాలు, ఘర్షణలు కూడా జరుగుతున్నాయి.
ఇలా ఒకరు, ఇద్దరు కాదు.. దాదాపు వంద మందిని ఈ మాయలేడి మోసం చేసింది. మోసపోయిన యువకుల బాధ ఒకలా ఉంటే, అపార్టుమెంట్‌లో ఉంటున్న వారి బాధలే ఎక్కువగా ఉన్నాయి. పగలు, రాత్రి లేకుండా గంటకొకరు వచ్చి తలుపు కొడుతుంటే, వారికి సమాధానం చెప్పలేకపోతున్న పరిస్థితి. ఇంట్లోని మగవారు ఆఫీసులకు పోలేక కాపలా కాయాల్సి వస్తోందని ఆ కుటుంబంలోని వారు వాపోతున్నారు.
ఇక సదరు వగలాడి నంబరును ట్రేస్ చేస్తుంటే ఒక రోజు చెన్నైలో, మరో రోజు నాగపూర్‌లో, ఇంకో రోజు బెంగళూరులో ఉన్నట్టు చూపిస్తోంది. ఇక కేసును ఛేదించడం తమ వల్ల కాదని భావించిన బేగంపేట సీఐ అశోక్‌రెడ్డి, ఇటీవల సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించారు. యువతి తయారు చేసుకున్న వెబ్ సైట్‌ను తొలగించగా, ఆమె మరో సైట్ సృష్టించుకుంది. అతి త్వరలోనే ఆమె ఆట కట్టిస్తామని చెబుతున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.