హైదరాబాద్ నగరంలోని ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో ఓ హృదయవిదారక దృశ్యం ఒకటి చోటుచేసుకుంది. ఇది చూపరులను కంటతడిపెట్టించింది. ఈ వివరాలను పరిశీలిస్తే.... ఏ ప్రాంతానికి చెందినదో తెలియని ఒక మహిళ ఎక్కడికో వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చింది. స్టేషన్‌కు వచ్చాక ఆమెకు మూర్ఛ వచ్చింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆ మహిళ స్టేషన్‌లోనే ప్రాణాలు కోల్పోయింది.
అయితే ఆమెతో ఉన్న చంటిబిడ్డకు ఈ విషయం తెలియక... తల్లిపాల కోసం మారాం చేశాడు. ఎంత పిలిచినా తల్లి లేవకపోవడంతో కాసేపు అలిగాడు. ఆ తర్వాత మళ్లీ తల్లి చెంతకు చేరి ఏడుపులంకించుకున్నాడు. తల్లిపాలు తాగే ప్రయత్నం చేసి, కన్నీళ్లింకిపోయి చివరకు తల్లి శవంపై ఆదమరచి నిద్రపోయాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్‌లో చూపరుల కంట నీరుతెప్పించింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చంటిబిడ్డను ఆస్పత్రికి తరలించారు.