వివాహేతర సంబంధానికి ఇరు కుటుంబాలు అడ్డువస్తున్నాయని కలత చెందిన ప్రియుడు, ప్రేయసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఇందు కోసం ప్రణాళిక సిద్ధం చేసుకుని రైలు క్రింద పడటానికి వెళ్లారు. అయితే ప్రియుడు రైలు క్రింద దూకగా ప్రేయసి మాత్రం ధైర్యం సరిపోక అలాగే నిలబడిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
కుప్పం మండలంలోని వెండుగంపల్లికి చెందిన 26 ఏళ్ల రమేశ్ ఒంగోలులో రాళ్ల పాలిష్ పనికి వెళుతుండేవాడు. దగ్గర్లో ఉన్న అక్కా బావల ఇంటికి తరచూ వెళుతుండేవాడు. అక్కడ అతనికి సుజాత అనే అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరూ 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇంటిని పోషించడానికి డబ్బులు సరిపోకపోవడంతో తిరుపతికి మకాం మార్చాడు.
ఓ హోటల్‌లో చెఫ్‌గా చేరాడు. అక్కడ ఫోన్‌లో బెంగుళూరుకు చెందిన యువతి పరిచయం అయింది. మనస్పర్థల కారణంగా ఆమె అప్పటికే భర్తను విడిచిపెట్టి ఉంది. క్రమంగా పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె మాయలో పడిన రమేశ్ ఆమెను కలవడానికి తరచూ బెంగుళూరు, మైసూరు వెళ్లేవాడు. ఆమె ప్రవర్తనలో మార్పు చూసి ఆమె బంధువులు మందలించారు.
రమేశ్ ఫోన్‌లో ఆమె ఫోటో ఉండటం చూసి అతని భార్య నిలదీసింది. తనకు, బిడ్డకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించింది. ఈ ఘటనలతో మనసు వికలమైన ప్రియుడు, ప్రేయసి మాట్లాడుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అక్క దగ్గర చైను, బావ దగ్గర బైకు తీసుకుని రమేశ్ బయటకు వచ్చి ప్రియురాలిని కలిసాడు.
చైన్ అమ్మేసి ఇద్దరూ ఫుల్లుగా మందు కొట్టారు. చనిపోవడానికి రైలు పట్టాల వద్దకు వెళ్లారు. రైలు వస్తుండగా రమేశ్ దాని క్రింద దూకేశాడు. ప్రేయసి మాత్రం ధైర్యం సరిపోక సొమ్మసిల్లి పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.