పిన్నితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఈ విషయం నలుగురికి తెలియడంతో ఇంటినుంచి లేచిపోయి ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడు.. తన బాబాయ్‌కి చనిపోయే ముందు ఓ మెసేజ్ పంపించాడు. 'బాబాయ్ మేము కర్ణాటకలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం. మన వారందరినీ చూడాలని ఉంది అని పిన్ని అనడంతో పొందూరుకు వచ్చాం. అయినా గ్రామానికి వెళ్లి మొహం చూపించడం సిగ్గుగా అనిపించింది. దీంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నాం. పిల్లలిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి' అంటూ సీతాలక్ష్మీ భర్త ప్రసాద్‌కు ధనుంజయ ఓ ఎస్‌ఎంఎస్ పెట్టాడు. ఆ తర్వాత వీరిద్దరూ ఆత్మహ్యకు పాల్పడ్డారు.
ఇదిలావుండగా, సీతాలక్ష్మి(32)కి బూరాడ ప్రసాద్ అనే వ్యక్తితో 12 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి 10, 8 యేళ్ల వయసు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, కొంతకాలంగా సీతాలక్ష్మికి తన బావ.. బూరాడ భుజంగరావు కుమారుడు ధనుంజయ అలియాస్ రాజు (21)తో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. ఈ క్రమంలో ఈనెల 28వ తేదీన ధనుంజయ - సీతాలక్ష్మిలు ఇంటి నుంచి పారిపోయారు. వీరిద్దరూ కలిసి వారం రోజుల పాటు ఎక్కడెక్కడో తిరిగారు.
ఇంతలో ఏమైందో.. ఏమో మంగళవారం పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైలుపట్టాలపై ఆత్మహత్య చేసుకున్నారు. మానవ సంబంధాల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తూ.. వరుసకు పిన్ని.. కొడుకుల మధ్య ఏర్పడిన ఈ వివాహేతర సంబంధం... వారి విషాదాంతానికి కారణమైంది. ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేసింది. బిడ్డపైనే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
ఈనేపథ్యంలో పోస్టుమార్టం అనంతరం వారి మృతదేహాలను బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సోమన్నపేటకు తీసుకువచ్చారు. ఆ మృతదేహాలను చూసి.. కుటుంబసభ్యులు, బంధువులు బోరున విలపించారు. గ్రామస్థుల సైతం కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ధనుంజయ చితికి తండ్రి భుజంగరావు, సీతాలక్ష్మి చితికి భర్త ప్రసాద్ నిప్పంటించారు. పరువుకోసమో, తాము చేసిన తప్పునకు సమాధానం చెప్పలేమోనని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని కొందరు అభిప్రాయపడ్డారు.