గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై పేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దాడులకు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సులువైన పరిష్కారం కనుగొన్నారు. మురుగు కాలువ స్థాయి మనుషులు చేసే వికృత చేష్ట్యలను మీరు పట్టించుకోవద్దు. ఇలాంటి మురికి వ్యాఖ్యలను పట్టించుకుంటే 'డ్రైనేజీ పీపుల్' స్థాయి పెంచినట్లు అవుతుంది కాబట్టి వాటి గురించి పట్టించుకోవద్దని గవర్నర్ సలహా ఇచ్చారు.
విషయం ఏమిటంటే.. సామాజిక మాధ్యమాల్లో తనను అవమానించేలా, అవహేళన చేస్తూ అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నరు నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నరును కలిశారు. ఈ సందర్భంగా కొందరు పనిగట్టుకుని తన ప్రతిష్టను దెబ్బతీసేలా దురుద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి వాటికి అడ్డుకట్టపడేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
‘ఇలాంటి అభ్యంతరకర పోస్టులు పెట్టినవారు, వాటిని చూపెట్టినవారు మురుగు కాలువ (డ్రెయినేజి) స్థాయి మనుషులు. మీరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గౌరవ ప్రతిష్టలున్నవారు. మురుగు కాలువ స్థాయి వ్యక్తులు చేస్తున్న వాటి గురించి ఆలోచించడం ద్వారా మీ స్థాయిని తగ్గించుకోవద్దు. మీరు వాటి గురించి ఆలోచిస్తే ‘డ్రైనేజి పీపుల్’ స్థాయి పెంచినట్లు అవుతుంది. అసలు వాటి గురించి పట్టించుకోవద్దు..’ అని ఈ సందర్భంగా గవర్నరు ఆయనకు ఉద్బోధించారు.