అమాయకత్వాని ఆసరాగా చేసి బరితెగించిన అంబులెన్స్ డ్రైవర్!!

ఆదివారం, 23 ఆగస్టు 2020 (10:33 IST)
ఓ అంబులెన్స్ డ్రైవర్ బరితెగించాడు. ఓ మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేశాడు. మీ భర్త కరోనా వైరస్ సోకి చనిపోయాడంటూ నమ్మించి ఏకంగా రూ.85 వేలు గుంజుకున్నాడు. కానీ, ఆ మహిళ భర్త కోవిడ్ కారణంగా చనిపోలేదనీ, కేవలం దీర్ఘకాలరోగాల వల్ల చనిపోయినట్టు డ్యూటీ డాక్టర్ ఇచ్చిన డెత్ రిపోర్టులో తేలింది. దీంతో అంబులెన్స్ డ్రైవర్ బండారం బయటపడింది. ఈ మోసం కర్నూలు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లా కేంద్రంలోని బి.క్యాంపునకు చెందిన కరణం సాయినాథరావు (67) ఈ నెల 14న తీవ్ర అస్వస్తతకు గురికాగా, ఆయన్ను ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. 
 
అయితే సాయినాథరావు కరోనాతో చనిపోయాడని బాధితులకు అంబులెన్స్‌ డ్రైవర్, సిబ్బంది చెప్పారు. మృతదేహాన్ని తామే అంత్యక్రియలకు తీసుకెళ్లాల్సి ఉంటుందని, వైరస్‌ వ్యాప్తి చెందకముందే తరలించాలని తొందరపెట్టారు. నిరక్షరాస్యులైన మృతుని భార్య.. విదేశాల్లో ఉన్న కుమారునికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. 
 
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉంటున్న కుమారుడు క్రాంతి కిరణ్‌ అక్కడి నుంచే ఫోన్‌లో అంబులెన్స్‌ సిబ్బందితో మాట్లాడారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు రూ.85 వేలకు ఒప్పందం చేసుకుని, ఫోన్‌ పే ద్వారా సురేష్‌బాబు ఖాతాకు జమ చేయగా, తన తల్లి రూ.35 వేలు నగదు చేతికి ఇచ్చింది.
 
అయితే, సాయినాథ్‌ రావు మరణ ధ్రువీకరణ పత్రం కోసం కుటుంబసభ్యులు గురువారం ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌ చూసి షాక్‌ తిన్నారు. సాయినాథ్‌రావు కరోనాతో చనిపోలేదని, సీఆర్‌ఎఫ్‌ (క్రానిక్‌ రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌ లేదా క్రానిక్‌ రీనల్‌ ఫెయిల్యూర్‌)తో చనిపోయాడని డ్యూటీ డాక్టర్‌ రేవతి పేరుతో ధృవపత్రం అందించారు. దీనిని వాట్సాప్‌‌లో విదేశాల్లోని కుమారుడు క్రాంతి కిరణ్‌కు పంపించారు. జరిగిన మోసాన్ని తెలుసుకున్న అతను.. విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు