రాయలసీమ రాజకీయాలంటేనే మర్చి ఘాటంతగా వుంటాయి. ఇక్కడి రాజకీయ నాయకులు ఏదీ మనసుల్లో దాచుకోరు. ఉన్నది వున్నట్లు పైకి మాట్లాడేస్తారు. వాళ్లున్నది ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు... తమ నియోజకవర్గ ప్రజలకు తాము చేసేది చేయాల్సిందేనంటారు. ఇందులో ఎలాంటి రాజీ వుండదు. ఈ క్రమంలో వర్గ వైషమ్యాలు తారాస్థాయిలో వుంటాయి. ఒకరికొకరు మాటల దాడి చేసుకుంటారు.
కర్నూలు జిల్లా అనగానే భూమా నాగిరెడ్డి వర్సెస్ శిల్పా చక్రపాణి రెడ్డి అని మాట్లాడేవారు. ఐతే మారిన రాజకీయ పరిస్థితుల రీత్యా భూమా నాగిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెదేపాలో చేరారు. అప్పటికే తెదేపాలో వున్న శిల్ప వర్గీయులకు ఇది ఎంతమాత్రం రుచించలేదనే వాదన వుండింది. ఐతే ఈ రెండు వర్గాలను ఒకటి చేసి కర్నూలులో పార్టీకి తిరుగులేకుండా చేయాలన్న తలంపుతో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సయోధ్య కుదిర్చారని అంటుంటారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్ప గెలుపును తన భుజస్కందాలపై వేసుకుని గెలిపించాలని బాబు ఆదేశించారని సమాచారం.
ఈ మేరకు భూమా తనకు అనుకూలంగా వుండే పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణా రెడ్డి వర్గానికి చెందిన 12 ఓట్లను శిల్ప చక్రపాణికి పడేలా భూమా చూడాల్సి వుంది. ఈ క్రమంలో ఆయన అక్కడికి వెళ్లాల్సి వుంది. ఐతే పొద్దుటూరు ప్రయాణం గురించి ఆయనకు గుర్తు చేసినప్పుడు తనకు కాస్త అలసటగా వున్నదంటూ తర్వాత చూద్దాం అని చెప్పారట. అలా చెప్పిన కాసేపటికే ఆయన కుప్పకూలిపోయారు. ఆయన మరణ వార్త భూమా వర్గీయులను శోకంలో ముంచేసింది. కాగా ఆయన సన్నిహితుల్లో కొందరు మాత్రం భూమా తన వైరి వర్గానికి మద్దతు నిలిచే విషయంలో ఆయన మనసు ఎలా ఆలోచించిందో కానీ బాడీ సహకరించలేదని అంటున్నారు.