టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బుధవారం లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని ఈ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని భువనేశ్వరి వెల్లడించారు.
ఇదే విషయంపై ఆమె ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మాట్లాడుతూ తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తిత్వాన్ని, సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని రక్తదానం నిర్వహిస్తున్నామన్నారు. గత ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో 145 చోట్ల ఇదే సందర్భంలో రక్తదాన శిబిరాలు విజయవంతంగా నిర్వహించామని, ఆ స్ఫూర్తితో ఈసారి మరిన్ని చోట్ల నిర్వహించాలని ప్రయత్నిస్తున్నామన్నారు.
ఆ తర్వాత ట్రస్టు సీఈవో టి.విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. ఈ భారీ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్టు రక్తనిధితోపాటు రెడ్‌క్రాస్, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, చిరంజీవి రక్తనిధి, ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు, ఆరోహి, ఇతర రక్తనిధి సంస్ధలు పాల్గొంటున్నాయన్నారు. తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం ఇక్కడి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో భువనేశ్వరి, బ్రహ్మణి ప్రారంభిస్తారు.