తెలంగాణ ప్రజలు కోరుకుంటేనే తెలంగాణ వచ్చిందని.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను పోరాటం చేస్తానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడిన పవన్ కల్యాణ్.. ప్రత్యేక హోదాపై కూడా స్పందించారు. ప్రత్యేక హోదా అనేది చాలా సున్నితమైన అంశం అని పవన్ అన్నారు.
దీనిపై ఉద్యమం చేయాలనుకుంటే.. తాను బలంగా చేయగలనని పవన్ నొక్కి చెప్పారు. కానీ ఒక నాయకుడిగా బాధ్యతతో వున్నానని.. తాను రోడ్డు మీదకు వస్తే మీరంతా తన వెంట వస్తారని... కానీ, అదే సమయంలో మీ తల్లిదండ్రులకు, అక్కచెల్లెళ్లకు తాను సమాధానం చెప్పే పరిస్థితి ఏర్పడుతుందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహారశైలిపై కూడా పవన్ విమర్శలు గుప్పించారు. గుజరాత్‌లో వంద అడుగులు పైచిలుకు ఉండే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నరేంద్ర మోదీకి ఏం చెబుతుందో తెలుసా? అని ప్రశ్నించారు. పార్లమెంటులో ఎలా పడితే అలా హామీలు ఇవ్వద్దని, ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోవాలని మోదీకే కాదు.. బీజేపీకి కూడా ఆ విగ్రహం సూచిస్తుందన్నారు.
ప్రత్యేక హోదాపై సామ, దాన, భేద విధానంలో పోరాడుతానని.. ఆ తర్వాతే రోడ్లపైకి వస్తానన్నారు. రాజకీయ పార్టీలకు చేతకానప్పుడు హామీలు ఇవ్వొద్దన్నారు. కేంద్రాన్ని తాను ఒకటే ప్రశ్నిస్తున్నానని ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పుకొచ్చిన కేంద్రం ఇవ్వకపోవడానికి తగిన కారణాన్ని చెప్పాలని.. ఆ కారణం ఏపీ ప్రజలను సంతృప్తిపరిచేలా వుండాలని తెలిపారు.
ఇంకా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఇంటర్ చదువుతున్నప్పుడే రాజకీయాల్లోకి రావాలనుకున్నానని తెలిపారు. సమాజానికి మేలు చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. సీఎం కావడానికి చాలా అనుభవం కావాలని.. నినాదాలు చేసినంత మాత్రం పొంగిపోనని పవన్ తెలిపారు. తనను జనసేన పార్టీని వదిలి భాజపాలో చేరాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అడిగారు. కానీ తాను అవకాశవాద రాజకీయాలకు దూరంగా వున్నానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.