ముఖ్యంగా కొత్తగా రూపుదిద్దుకొన్న రాష్ట్రానికి రాజధాని నిర్మించడానికి తాను అహర్నిశలు కష్టపడుతున్నానని, కానీ తనపై కక్షతో వాటిని కూడా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాబు ఆవేదన వ్యక్తంచేశారు. ‘ప్రతి తెలుగువాడూ గర్వించేలా రాజధాని నిర్మించాలని తపిస్తున్నాను. ఇది నా కోసం కాదు. నేనొక్కడినే ఉండేందుకు కాదు. ప్రపంచ బ్యాంకును ఒప్పించి నిధులు తేవాలని ప్రయత్నిస్తున్నాం. దానిని కూడా అడ్డుకోవడానికి.. పనిగట్టుకుని రైతుల పేరుతో రుణం ఇవ్వవద్దని లేఖలు పంపారని గుర్తు చేశారు.
ఢిల్లీలోని ప్రపంచ బ్యాంకు కార్యాలయానికి వెళ్లి మరీ ఫిర్యాదులు చేసి వచ్చారు. నాపై కోపం ఉంటే రాజకీయంగా పోరాటం చేయవచ్చు. కానీ నిధులు రాకుండా అడ్డుపడటం ఏమిటి? మరే రాష్ట్రంలో అయినా ఏ ప్రతిపక్షమైనా ఇలా చేస్తుందా? ఓపక్క నిధుల కోసమే తిరగాలా? ఇలాంటి ఫిర్యాదులకు సమాధానాలే ఇచ్చుకోవాలా? ఒక్కో అడ్డంకిని ఎంతో శ్రమతో అధిగమించాల్సి వస్తోంది’ అంటూ మనసులోని ఆవేదన వెళ్లగక్కారు.
రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కూడా శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారని పవన్‌కు వివరించారు. ‘పోలవరం వచ్చేలోపు రైతులకు ఎంతో కొంత నీరు ఇవ్వాలని పట్టిసీమ ప్రాజెక్టు చేపడితే అది రాకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష జరుపుతున్నాను’ అన్నారు.