బ్రాండ్ అంబాసిడర్‌గా సానియాను తొలగించాలి : రాజాసింగ్

మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (18:06 IST)
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కోడలైన సానియా మీర్జాను తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించాలని బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌, సీఎం కేసీఆర్‌ను కోరుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పాకిస్థాన్ కోడలైన సానియామీర్జాను తొలగించి తెలంగాణాకు చెందిన క్రీడాకారులకు ఆ హోదా ఇవ్వాలని ఆయన కోరారు. సానాయా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్  షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పుల్వామా దాడులపై పలువురు నేతలు, ప్రముఖులు, సెలెబ్రిటీలు తీవ్రంగా ఖండించిన నేపథ్యంలో.. భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, పాకిస్థాన్ కోడలు  సానియా మీర్జా స్పందించకపోవడంతో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
 
పుల్వామా ఘటనను ఆమె ఖండించకపోవడంతో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో సానియా మీర్జాకు ఎక్కడలేని కోపం వచ్చింది. పుల్వామా దాడులను ఖండించి.. తాను డాబాపైకెక్కి గట్టిగా అరవాలా అంటూ ప్రశ్నించింది. సాధారణంగా సెలెబ్రిటీలు ఇలాంటి ఘటనలపై తప్పక స్పందించాలని నెటిజన్లు ఆశిస్తున్నారు. వాళ్లకు తానేం చెప్పాలనుకుంటున్నానంటే.. మీ కోపతాపాలను మాలాంటి సెలెబ్రిటీలపై చూపిస్తున్నారు. పుల్వామా ఘటనపై సోషల్ మీడియాలో ఖండించాలనే అవసరం తనకు లేదని సానియా తేల్చేసింది. అలా కాకుంటే మా ఇంటి డాబాపైకెక్కి.. నిలబడి అరవమంటారా అంటూ ఆవేశానికి గురవుతూ ప్రశ్నించింది. 
 
తీవ్రవాదంపై సోషల్ మీడియాలోనే ఖండిస్తూ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. తీవ్రవాదాన్ని ఎక్కడైనా తీవ్రంగా ఖండిస్తాను. అలాగే ఉగ్రవాద చర్యలను పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పింది. స్థిమితంగా ఆలోచించే వారందరూ ఉగ్రవాదాన్ని ఎదిరించే వారే. తాను దేశం కోసం చెమటోర్చి ఆడుతాను. అలాగే తాను దేశానికి సేవ చేస్తున్నాను. పుల్వామా దాడుల్లో అమరులైన సైనికుల కుటుంబానికి తాను అండగా వుంటాను. అమరులైన సైనికుల కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటున్నానని సానియా మీర్జా తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు