రోజా ప్రశ్నలకు బిక్కమొహం వేసి నీళ్లు నమిలిన బ్యాంక్ మేనేజర్.. మోడీ చేసింది మంచి పనే కానీ?

ఆదివారం, 13 నవంబరు 2016 (13:44 IST)
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ రూ.500 – రూ.1000 నోట్లు ర‌ద్దు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యం దేశంలో న‌ల్ల‌ధ‌న కుబేరుల గుండెళ్లో రైళ్లు ప‌రిగెట్టిస్తోంది. మోడీ ఈ ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టి నుంచే న‌ల్ల‌ధ‌న కుబేరుల‌కు కంటిమీద కునుకులేకుండా పోయింది. మరోవైపు పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు డబ్బు కోసం బ్యాంకుల చుట్టూ, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో.. పెద్ద నోట్లతో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కూడా తిప్పలు తప్పలేదు. 
 
నగదు మార్పు కోసం చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఎస్‌బీఐ బ్యాంకుకు రోజా వెళ్లారు. సామాన్య ప్రజలతో పాటు క్యూలో నిలబడ్డారు. అయితే బ్యాంకులో నగదు కొరత ఉందని తెలియడంతో బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్లారు. సామాన్య ప్రజల కోసం మాట్లాడారు. పాత నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాల్సిందిగా కేంద్రం చెప్పిన తరుణంలో మీరెందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. 
 
రోజా వేసే ప్రశ్నలకు ఏం సమాధానం ఇవ్వాలో తెలియక బ్యాంక్ మేనేజర్ బిక్కమొహం వేసి.. నీళ్లు నమిలారు. ముందస్తు చర్యలు లేకుండా రూ. 500, 1000 నోట్లను ప్రభుత్వం రద్దు చేయడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రోజా అన్నారు. ప్రజలందరూ పనులన్నీ మానుకొని బ్యాంకుల దగ్గరే పడిగాపులకాస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం చేసేది మంచి పనే అయినా.. పక్క ప్రణాళికతో ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేసుంటే బాగుండేదని రోజా అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి