విజయవాడ: రాజ్యసభలో ప్రత్యేక హోదా బిల్లును టీడీపీ సమాధి చేసిందని మాజీమంత్రి వట్టి వసంత్ కుమార్ ఆరోపించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ, రాజ్యసభ సభ్యులు కె.వి.పి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్‌కు రాకుండా బీజేపీ - టీడీపీ కుమ్మక్కయ్యాయని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ప్రత్యేకించి రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్‌ను మోడీ కాళ్ల ముందు మోకరిల్లి తాకట్టు పెట్టారన్నారు.
ఏ మూల్యం ఆశించి ఈ విధంగా చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యం కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకుంటున్న టీడీపీ, బీజేపీతో కలిసి డ్రామాలు ఆడుతుందన్నారు. పుష్కరాలకు కేంద్రమంత్రులను ఆహ్వనించేందుకు అని ఢిల్లీ వచ్చిన చంద్రబాబు, ప్రధాని సరేంద్ర మోడిని, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, వెంకయ్యలతో సమావేశం అయిన తరువాత టీడీపీ ఎంపీలు కూడా ప్రధానిని కలిసి.. ఒక అవగాహనతోనే ప్రత్యేక హోదా బిల్లును అడ్డుకున్నారని అన్నారు.
హోదా బిల్లును మనీ బిల్లుగా పేర్కొనడంపై టీడీపీ, బీజేపీతో చేసుకున్న రహస్య ఒప్పందానికి నిదర్శనం అన్నారు. బిల్లును రాజ్యసభ నుంచి లోక్ సభకు పంపేటప్పుడు కేంద్రమంత్రి సుజనా చౌదరి చప్పట్లు కొట్టడం సరికాదన్నారు. సభలో కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తుతుంటే... టీడీపీ ఎంపీలు ఎందుకు బయటకు వెళ్లిన్నట్లు అని ప్రశ్నించారు.