తుఫాను తాకిడికి వణుకుతున్న స్మార్ట్ సిటీ తిరుపతి

గురువారం, 11 నవంబరు 2021 (11:24 IST)
ఎక్కడ చూసినా వర్షం కారణంగా నీళ్లతో నిండిపోయిన గుంతలు...  తెలియక పడిపోతున్న వాహనదారులు...  ఇది తిరుపతి నగరంలో నెలకొన్న తాజా పరిస్థితి. పేరు గొప్ప,  ఊరు దిబ్బ అన్న చందంగా తిరుపతి నగరం తయారయింది. పేరుకే స్మార్ట్ సిటీ... ఎక్కడ చూసినా గందరగోళం. రోడ్లు దెబ్బతినిపోయాయి. తిరుపతి నడిబొడ్డున ఉన్న మధురానగర్ లో చినుకుపడితే చాలు, చెరువులా మారిపోతుంది. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థంకాక స్థానికులు అయోమయంలో ఉన్నారు. 
 
 
వర్షం వచ్చిందంటే డ్యూటీకి వెళ్లాల్సిన ఉద్యోగులు, స్కూలుకు వెళ్లాల్సిన పిల్లలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు. నడుము లోతు నీళ్ళు, డ్రైనేజీ నీళ్లతో దుర్గందం, వెరసి ఈ ప్రాంతమంతా తీవ్ర ఇబ్బందులు నెలకొని ఉన్నాయి. ఈ ప్రాంతం గురించి తెలియని వాహనదారులు ఆటోలు, కార్లు, స్కూటర్లు ఇక్కడ పార్క్ చేస్తే మునిగిపోవడం ఖాయం. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన మున్సిపల్ యంత్రాంగం చేష్టలుడిగి పోయింది.
 
 
తిరుపతి నగరంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు  పడుతున్నారని తక్షణం మున్సిపల్ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం నేత కందారపు మురళి ఒక ప్రకటనలో కోరారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయని, తిరుపతి నగరం అంతటా అనేక ప్రయివేటు కంపెనీలు తమ అవసరాల కోసం రోడ్లను తవ్వి విచక్షణారహితంగా వదిలిపెట్టయడంతో వాటిలోకి వర్షపు నీరు చేరి అవి నడుము లోతు గుంతలుగా మారిపోతున్నాయి. అది తెలియని వాహనదారులు పడిపోవడం, ప్రమాదాల బారిన ప‌డ‌టం ఈ కాలంలో ఎక్కువ‌యింది. 
 
 
ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లోపించడం పనులు చేసిన వారు ఎక్కడవి అక్కడ వదిలి వెళ్లిపోవడం ప్రైవేటు సంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరించడం ఈ పరిస్థితికి కారణమని ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ,  వివిధ  ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో వ్యవహరిస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చని సూచించారు. వర్షానికి ఇబ్బందులు పడుతున్న లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేకమైన సహాయక చర్యలు చేపట్టాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు