నవంబరు నుండి ఆన్‌లైన్ సేవలుగా శ్రీవారి ఆర్జిత సేవలు
బుధవారం, 28 అక్టోబరు 2020 (08:11 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్రదీపాలంకార సేవలను కోవిడ్ - 19 నేపథ్యంలో భక్తుల కోరిక మేరకు ఆన్‌లైన్లో వర్చ్యువల్ విధానంలో నవంబరు మాసంలో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది.
ఆగస్టు 7వ తేదీ నుండి ఆన్‌లైన్ లో వర్చ్యువల్ సేవగా శ్రీవారి కల్యాణోత్సవం భక్తులకు అందుబాటులో ఉన్న విషయం విదితమే.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్ తరువాత శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తున్నది.
ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబరు నెలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను, అక్టోబరులో నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
కాగా భక్తుల కోరిక మేరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్రదీపాలంకార సేవలను కూడా ప్రయోగాత్మకంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఈ సేవలను ఆన్‌లైన్ వర్చ్యువల్ సేవగా భక్తులకు అందుబాటులో ఉంచేందుకు టిటిడి చర్యలు చేపట్టింది.
ఈ సేవలు పొందిన భక్తులకు ఆ టికెట్టుపై శ్రీవారి దర్శనం ఉండదు. దర్శనం పొంద దలచిన గృహస్తులు శ్రీవారి దర్శనం కొరకు ప్రత్యేక దర్శన టికెట్లు ఆన్ లైన్ లో పొందవలసి ఉంటుంది.
ప్రస్తుతం రాష్ట్రంలోను, తిరుమలలోను కోవిడ్ - 19 ప్రభావం తగ్గిన నేపథ్యంలో సాయంకాలం నిర్వహించే సహస్రదీపాలంకార సేవను భక్తుల కోరిక మేరకు ఆలయం బయట సహస్రదీపాలంకార సేవా మండపంలో ప్రయోగాత్మకంగా నిర్వహించడానికి టీటీడీ నిర్ణయించింది.
అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు నాలుగు మాడ వీధులలో విహరించి ఆలయానికి చేరుకుంటారు.