జానపద జలనిధి జాలాది

సోమవారం, 9 ఆగస్టు 2021 (20:24 IST)
జాన‌ప‌ద జ‌ల నిధి... జాలాది 90 వ‌సంతాల జ‌యంతి వేడుక‌ల్నికృష్ణా జిల్లా నందిగామలో ఘ‌నంగా నిర్వ‌హించారు. స్థానిక వెంకటేశ్వర కల్యాణ మండపంలో స్నేహ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ గేయ రచయిత జాలాది రాజారావు జ‌యంతికి ముఖ్య అతిథి రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత హాజ‌ర‌య్యారు.

ఆమెతో పాటు మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, ఏపీ ఎఫ్ డీసి చైర్మన్ అరుణ్ కుమార్ జాలాది చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా హోం శాఖ మాత్యులు మేకతోటి సుచరిత మాట్లాడుతూ, పేద కుటుంబంలో పుట్టి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సినీ గేయ రచయిత జాలాది రాజారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. ప్రతిభ ఉంటే ఎదుగుదలకు కులం -పేదరికం అడ్డుకాదని నిరూపించిన మహనీయులలో జాలాది ఒకరని ప్రశంసించారు.,
 
ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ, నందిగామ ప్రాంతంలో పుట్టి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన జాలాది జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. నందిగామ ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన మహనీయులలో ఒకరైన జాలాది విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సభాముఖంగా తెలిపారు. దళిత జాతి ఎదుర్కొంటున్న ఇబ్బందులను చేదించుకుంటూ ఎన్నో అభ్యుదయ గేయాలు రచించిన జాలాది కలం సమాజ చైతన్యానికి కృషి చేసిందని తెలిపారు.
 
అనంతరం నందిగామ ప్రాంత కవులను, రచయితలను హోంమంత్రి సుచరిత ,ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాలాది కుమార్తె విజయ, దయ సాగర్, స్నేహా క్లబ్ ప్రతినిధులు, జాలాది అభిమానులు, నందిగామ పరిసర ప్రాంత కవులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు