మమ్మల్ని వైజాగ్ పంపి నువ్వు షూటింగులో పాల్గొంటావా పవన్: ఈసడించిన భరద్వాజ

శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (06:55 IST)
పవన్‌కల్యాణ్‌ని నమ్మి జనవరి 26న ప్రత్యేక హోదా కోసం వైజాగ్‌లో నిరసనకు తనతోపాటు చాలామంది హాజరయ్యారని, పవన్‌ మాత్రం వైజాగ్‌లో అడుగుపెట్టకపోవడం బాధాకరమని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు.  ‘డబ్బు కోసం కాదు... ప్రజల కోసమే పోరాటం చేస్తానంటున్న పవన్‌ మాటలను నమ్ముతున్నా. స్టేట్‌మెంట్లతో సరిపెట్టకుండా క్లారిటీతో ప్రజల కోసం పోరాటం చేస్తానంటే పవన్‌తో కలసి ముందడుగు వేయడానికి యువకులు వేలల్లో సిద్ధంగా ఉన్నారు. అందులో నేను కూడా ఉంటా’ అని తమ్మారెడ్డి వివరించారు. 
 
ఏపీకి సంబంధించి పవన్‌కి స్పష్టత ఉందో లేదో అర్థం కావడం లేదని తమ్మారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటున్నారా లేక హోదా గురించి స్పష్టత కావాలనుకుంటున్నారో తనవంటి వారికి బోధపడటం లేదన్నారు. పవన్‌కల్యాణ్‌ తీరుపై ‘నా ఆలోచన’ శీర్షికతో ఓ వీడియోను ఆయన సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ‘ప్రశ్నకు సమాధానం అడుగుతున్నారా స్పష్టత కోరుతున్నారా అనే క్లారిటీ కావాలి. ప్రశ్నకు సమాధానం అయితే ప్రభుత్వం నుంచి ఎప్పుడో వచ్చేసింది. ఇకపై దాని గురించి కల్యాణ్‌ మాట్లాడకపోతే మంచిది. స్టేటస్‌ గురించి ఇటు పవన్‌, అటు వైసీపీ, కాంగ్రెస్‌ ఎప్పటికప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తూనే ఉన్నాయి. అధికార పార్టీ కూడా స్టేటస్‌ వస్తే మంచిదేకానీ.. అది లేదంటున్నారు కదా... అంతకుమించి ప్యాకేజీ రూపంలో తెచ్చుకుందాం అంటూ గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తోంది’ అని అన్నారు. 
 
జనసేన అధినేత కల్యాణ్ తొలినుంచి ట్విట్టర్లో పంచ్ డైలాగులు వేసుకుంటూ ఆచరణలో మాత్రం షూటింగుల్లో పాల్గొంటూ కాలం గడుపుతుండటంపై ఇటీవల నెటిజన్లలో విసుర్లు ఎక్కువైన నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ వంటి చిత్రపరిశ్రమలో సీనియర్ పవన్‌కు ముందుగా ఏపీ సమస్యలపై స్పష్టత అనేది ఉందా అని నేరుగా ప్రశ్నించండి గమనార్హం.
 

వెబ్దునియా పై చదవండి