ఏపీ ఆర్టీఏ కమిషనర్ బాలసుబ్రమణ్యంపై టీడీపీ నేతలు దాడికి పాల్పడిన విషయం తెల్సిందే. ఈ అంశంలో విపక్షాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో సీఎం చంద్రబాబు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. టీడీపీ నేతల దురుసు ప్రవర్తనపై పూర్తి సమాచారం తెప్పించుకున్నారు. కేశినేని నాని, బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాను తన కార్యాలయానికి పిలిపించుకుని క్లాస్ తీసుకున్నారు. తక్షణమే ఆర్టీఏ కమిషనర్, సిబ్బందికి క్షమాపణ చెప్పాలని సూచించారు.
పార్టీ అధినేత చంద్రబాబు క్లాస్ తీసుకోవడంతో టీడీపీ నేతలు నేరుగా రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌కు క్షమాపణలు చెప్పారు. మనసు నొచ్చుకుని ఉంటే మన్నించాలని కోరారు. శనివారం జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. సీఎం సూచన మేరకు కమిషనర్‌కు విచారం వ్యక్తం చేశామని, తమకు ఎలాంటి బేషజాలు లేవన్నారు. ఉద్యోగులపై దాడితో ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని ఆర్టీఏ కమిషనర్ బాలసుబ్రమణ్యం అన్నారు.