గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అయితే, ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఓర్వలేని జగన్ అండ్ కో విషం కక్కుతోందని టీడీపీ ఘాటుగా కౌంటరిచ్చింది.
ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ హామీ ఇచ్చిన టీడీపీ కూటమి అధికారం చేపట్టాక మాటమార్చారంటూ సీఎం చంద్రబాబుపై వైకాపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పి ఇపుడు జిల్లా పరిధిలోనే ఉచితమని కొర్రీలు పెడుతున్నారంటూ ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆంక్షలు పెడుతున్నారంటూ మండిపడుతున్నారు.
జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రీగా ప్రయాణించవచ్చని టీడీపీ చీఫ్ చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఇపుడు ఆ హామీని అమలు చేస్తోంది. ఈ హామీతో మహిళలకు మేలు జరగడం ఓర్వలేని జగన్ ఉచిత బస్సు ప్రయాణంపై విషం కక్కుతున్నారు అంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు.