వందేళ్ల తరవాత దేశంలోనే తొలిసారిగా రీ సర్వే: ధర్మాన కృష్ణదాస్

శనివారం, 12 డిశెంబరు 2020 (06:34 IST)
దేశ చరిత్రలో తొలిసారిగా వైఎస్సార్ జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం కింద భూ రీ సర్వే చేస్తున్నామని, మూడు దశల్లో 17,460 గ్రామాల్లో ఈ సర్వే చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.

ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న ఈ సర్వే ఆగస్టు 2023 నాటికి పూర్తికానుందన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండల తక్కెళ్ల పాడు గ్రామంలో వైఎస్సార్ జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం కింద భూ రీ సర్వే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారన్నారు. రీ సర్వే వల్ల గ్రామాల్లో భూ తగదాలకు ఫుల్ స్టాప్ పడతాయన్నారు. 
 
రాష్ట్రంలో వైఎస్సార్ జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం కింద చేపడుతున్న భూ సర్వే దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయమన్నారు. సమర్థవంతమైన అధికారుల పర్యవేక్షణలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు. సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర రెవెన్యూ శాఖ సంయుక్తంగా రీ సర్వే చేపడుతున్నాయన్నారు. 
 
ఈ నెల 21న సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం...
2019 ఎన్నికల ముందు నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా అధిక శాతం రైతుల నుంచి భూ సరిహద్దులకు సంబంధించిన ఫిర్యాదులు సీఎం జగన్మోహన్ రెడ్డికి అందేవని డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఆనాడే భూ రీ సర్వే చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.

పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో భూ రీ సర్వే విజయవంతమైందన్నారు. ఈ నెల 21 న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అదే గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా భూయజమానులకు భూ హక్కు పత్రాలు సీఎం జగన్ అందజేస్తారన్నారు. భూ రీ సర్వే ద్వారా గ్రామాల్లో భూ తగదాలకు, వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు.

ఈ నెల 21 ప్రారంభమయ్యే రీ సర్వే ఆగస్టు 2023 నాటికి పూర్తి చేస్తామన్నారు. భూ రీ సర్వే చేపట్టాలంటూ సీఎం జగన్ తీసుకున్న  దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్ కొనియాడారు. 
 
3 విడతల్లో భూ రీ సర్వే...
రాష్ట్ర వ్యాప్తంగా 17,460 గ్రామాల్లో లక్షా 26 లక్షల చదరపు కిలో మీటర్లలో భూ రీ సర్వే చేపడుతున్నామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. మూడు విడతల్లో ఈ సర్వే పూర్తి చేస్తామన్నారు. మొదటి విడత 5,000 గ్రామాల్లో, రెండో విడత 6,500 గ్రామాల్లో, మూడో విడత 5,500 గ్రామాల్లో రీ సర్వే నిర్వహిస్తామన్నారు.

గ్రామాల్లో 2 కోట్లా 26 లక్షల ఎకరాల వ్యవసాయ భూముల్లో రీ సర్వే నిర్వహించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ – 2020 కింద శాశ్వత భూ హక్కు కల్పించనున్నామన్నారు. భూ హద్దులు నిర్ణయించి...సర్వే రాళ్లను పెట్టిన తరవాత భూ యజమానికి ల్యాండ్ టైటిలింగ్ చట్డం కింద భూ పటం(ల్యాండ్ మ్యాప్), భూ హక్కు పత్రం(ల్యాండ్ టైటిల్ కార్డ్) అందజేస్తామని, దీనివల్ల సదరు భూ యజమానికి ఆ భూమిపై శాశ్వత హక్కు లభిస్తుందన్నారు. 
 
అత్యాధునిక పరిజ్ఞానం... రూ.987 కోట్లతో రీ సర్వే...
భూ రీ సర్వే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కార్స్(CORS) వినియోస్తున్నామని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. కోర్స్ పరిజ్ఞానంలో భాగంగా డ్రోన్లు, రోవర్ల వంటి అత్యాధునిక పరికరాలు వినియోగిస్తున్నామన్నారు. ఇప్పటికే 9,500 సర్వేయర్లకు శిక్షణ అందజేశామన్నారు. వారి ద్వారా 4,500 వీఆర్వోలకు, 2,000 మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ప్లానింగ్, పంచాయతీ కార్యదర్శులకు కూడా శిక్షణ అందజేశామన్నారు.

వైఎస్సార్ జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం కింద భూ రీ సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.987.46 కోట్లు వెచ్చిస్తోందన్నారు. సర్వే కోసం 70 బేస్ స్టేషన్లు అవసరం కాగా, ఇప్పటికే 5 బేస్ స్టేషన్లు పూర్తయ్యాయన్నారు. మరో 65 బేస్ స్టేషన్లు సిద్ధం చేస్తున్నామన్నారు. 
 
వివాదాలకు నాలుగు స్థాయిల్లో పరిష్కారాలు : సీసీఎల్ఏ నీరభ్‌కుమార్ ప్రసాద్
భూ రీ సర్వే సందర్భంగా తలెత్తే వివాదాలను నాలుగు స్థాయిలో పరిష్కార మార్గాలు చూపుతామని సీసీఎల్ఏ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. తొలుత వీఆర్వో స్థాయిలో అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే తహసీల్దార్ నేతృత్వంలోని మొబైల్ టీమ్ ను ఆశ్రయించొచ్చునన్నారు.

అక్కడ కూడా సంతృప్తి చెందకపోతే...జాయింట్ కలెక్టర్ స్థాయిలో, ఇంకా పరిష్కారం లభించలేదనుకుంటే జిల్లా కలెక్టర్ స్థాయిలో వివాదాలకు పరిష్కారం చూపుతామన్నారు. కార్స్ వంటి అత్యాధునిక పరిజ్ఞానం ద్వారా చేపడుతున్న రీ సర్వే అత్యుత్తమ ఫలితాలు రాబడుతుందన్నారు. రీ సర్వే  సందర్భంగా రోవర్లు, డ్రోన్లతో పాటు పాత చైన్ లింగ్ సిస్టమ్ తోనూ, సివిల్ ఇంజనీరింగ్ మెథడ్ తోనూ కొలతలు వేస్తామన్నారు.

సర్వే పూర్తయిన తరవాత భూ హక్కు పత్రం(ల్యాండ్ టైటిల్ కార్డ్) అందజేస్తామన్నారు. ప్రతి సర్వేకు ఆధార్ తరహాలో యూనిక్ ఐడీ నెంబరు ఇస్తామన్నారు. ఇలా ఇవ్వడం దేశ చరిత్రలోనే తొలిసారి అని ఆయన తెలిపారు. ప్రతి చదరపు కిలో మీటర్ సర్వేకు రూ.5 వేల చొప్పున కేంద్రం అందజేస్తుందన్నారు.

రాష్ట్రంలో చేపడుతున్న భూ రీ సర్వే కోసం కేంద్రప్రభుత్వం రూ.200 కోట్లు అందజేసిందని తెలిపారు. రీసర్వేలో సర్వే డిపార్టుమెంట్‌తో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు కూడా పాలుపంచుకుంటాయ‌ని టున్నాయన్నారు. సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి పాల్గొన్నారు. 
 
సర్వే విజయవంతానికి అధికారులు సహకరించాలి...
అంతకుముందు సచివాలయంలోని అయిదో బ్లాక్ లో వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సర్వే అసిస్టెంట్ అధికారులకు వైఎస్సార్ జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం పై శుక్రవారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ ను ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న వైఎస్సార్ జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం కింద భూ రీ సర్వే విజయవంతానికి అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సర్వే డిపార్టుమెంట్ తో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు ఈ రీ సర్వేలో పాల్గొనబోతున్నారని, వారంతా సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందన్నారు. గ్రామాల్లో భూ తగదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ వర్క్ షాప్ లో సీసీఎల్ఏ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి, ఎస్.ఎస్.&ఎల్.ఆర్. కమిషనర్ సిద్ధార్థ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు