కొత్త విధానం ద్వారా నిత్యం 45వేల టన్నుల ఇసుక.. మంత్రి పెద్దిరెడ్డి
మంగళవారం, 22 అక్టోబరు 2019 (19:21 IST)
రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
సచివాయలంలో మైనింగ్ శాఖ కార్యదర్శి రామ్ గోపాల్ తో కలిసి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కృష్ణా , గోదావరినదుల్లో వరద కొనసాగుతోందని, దీనివల్ల ప్రధానమైన రీచ్ ల నుంచి ఇసుకను అందించలేక పోతున్నామని తెలిపారు.
రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ ప్రకటించిన తరువాత ప్రారంభంలో అయిదు వేల టన్నుల ఇసుకను అందించగా, నేడు దానిని నలబై అయిదు వేల టన్నుల మేరకు పెంచగలిగామని తెలిపారు. గత పదేళ్లలోని వర్షాభావ పరిస్థితులకు భిన్నంగా ఈ ఏడాది సంవృద్దిగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. దీనివల్ల కృష్ణానదిలో డెబ్బై రోజులుగా, గోదావరిలో నలబై రోజులుగా వరద కొనసాగుతోందని అన్నారు.
ఈ పరిస్థితుల్లో ఇసుక కొరత ఉత్పన్నమైందని, దీనిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఇసుక రీచ్‌లను గుర్తిస్తున్నామని అన్నారు. ఇప్పటికే పట్టాభూముల్లో మేట వేసిన ఇసుకను తొలగించేందుకు టన్నుకు వంద రూపాయలు చొప్పున చెల్లిస్తామని భూయజమానులతో ఒప్పందాలు చేసుకుంటున్నామని అన్నారు.
ఇప్పటికే ఎనబై రెండు మంది పట్టా భూముల యజమానులు ఇసుక తవ్వకాల కోసం ఒప్పందాలు చేసుకున్నారని, వారిలో పది పట్టాభూములకు అనుమతి కూడా ఇచ్చామని వెల్లడించారు. మరో పదిహేను రోజుల్లో ఇసుక కొరత లేకుండా అడిగిన వారందరికీ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇప్పటి వరకు ముప్పై ఆరువేల మంది దరఖాస్తు దారులకు ఆరులక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను సరఫరా చేశామని తెలిపారు. క్రెడాయ్, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ లతో మాట్లాడి, వారి అవసరాలకు కూడా దాదాపు యాబై వేల టన్నుల ఇసుకను అందించామని తెలిపారు.
ఈ రెండు నిర్మాణరంగ అసోసియేషన్ లతో సమావేశాలు నిర్వహించి, వారి అవసరాలు ఎంత, ఏ మేరకు ఇసుకను అందించాలో అవగాహనకు వచ్చామని తెలిపారు.
భవిష్యత్తులో ఇసుకకు కొరత లేదు...
తాజా వరదల కారణంగా నదుల్లో దాదాపు పది కోట్ల టన్నుల ఇసుక మేట వేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సాధారణంగా రాష్ట్రంలో ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక మాత్రమే వినియోగిస్తున్నారని అన్నారు. అంటే మరో అయిదేళ్లకు సరిపడ్డ ఇసుక నిల్వలు రాష్ట్రంలో వున్నాయని తెలిపారు.
ఇప్పటికే 1295 మంది బల్క్ కన్స్యూమర్ లకు అయిదు లక్షల టన్నుల ఇసుకను అందించామని తెలిపారు. మరో పదిహేను రోజుల్లో వరదలు కూడా తగ్గుముఖం పడతాయని భావిస్తున్నామని, ఇసుక రీచ్ ల నుంచి వరదనీరు తగ్గగానే కావాల్సినంత ఇసుకను వినియోగదారులకు అందచేస్తామని వెల్లడించారు.
ఇసుక దోపిడీకి అవకాశం లేకపోవడంతోనే ఆరోపణలు...
రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఏనాడు సరైన వర్షాలు పడలేదని, వరదలు రాలేదని మంత్రి విమర్శించారు. నదుల్లోని ఇసుకను యధేచ్చగా దోచుకున్న తెలుగుదేశం నేతలకు తమ అధికారం, ఆదాయం పోయిందనే అక్కసుతోనే ఇసుక లభ్యతపై రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
నదుల్లో రీచ్ లు వరదతో నిండిపోతే ఎవరైనా ఇసుకను ఎలా వెలికితీస్తారని ప్రశ్నించారు. ఈ మాత్రం అవగాహన లేకుండానే ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దారుణమని అన్నారు. సాధారణంగానే వర్షాకాలంలో భవన నిర్మాణ రంగంలో పనులు నెమ్మదిస్తాయని, కార్మికులకు లీన్ పీరియడ్ గా వుంటుందని అన్నారు.
రాష్ట్రంలో సంవృద్దిగా వర్షాలు కురుస్తుండటం కూడా ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయానికి అనుకూలంగా మంచి వర్షాలు పడుతుంటే... ఓర్వలేక ఈ రకంగా ఇసుక సమస్యను రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు హయాంలో కరువు తప్ప, రైతులకు ఉపయోగపడేలా వర్షాలు ఏనాడు పడలేదని అన్నారు. నదుల్లోని ఇసుకను విచ్చలవిడిగా దోచుకున్న ఫలితంగా కృష్ణానదిలోని ఇసుక గోతుల్లో ఓ బోటు మునిగి అనేక మంది మరణించారని గుర్తుచేశారు. ఇసుక దోపిడీపై గ్రీన్ ట్రిబ్యూనల్ చంద్రబాబు ప్రభుత్వానికి ఏకంగా వందకోట్ల రూపాయలు జరిమానా కూడా విధించిందని అన్నారు. ఇటువంటి విధానాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పూర్తి విరుద్దమని స్పష్టం చేశారు.
ఎంశాండ్ యూనిట్లకు ప్రభుత్వ ప్రోత్సాహం..
రాఫ్ట్రంలో ఇసుకకు ప్రత్యామ్నాయంగా కంకర నుంచి తయారుచేసే ఎంశాండ్ యూనిట్లకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించేందుక సిద్దంగా వుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుతం వున్న మెటల్ క్వారీల్లో ఎంశాండ్ యూనిట్లు నెలకొల్పే వారికి పావలావడ్డీకి రుణాలు అందించాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని వెల్లడించారు.