ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజ్యసభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభు తిరుమల పర్యటనలో తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధిపై తితిదే ఈఓ సాంబశివరావుతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి ముందే శనివారం ఉదయం నుంచి రాష్ట్రమంత్రి కామినేనితో కలిసి తితిదే ఈఓతో చర్చించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, కల్పించాల్సిన సౌకర్యాలపై మాట్లాడారు.
డార్మెటరీలతో పాటు మరిన్ని సౌకర్యాలు కావాలంటే ఖచ్చితంగా భూమి ఎంతో అవసరమన్నారు. దీనిపై స్పందించిన తితిదే ఈఓ స్థలాలు కావాల్సినన్ని ఉన్నాయని, ఎంత స్థలం కావాలన్నా తితిదే ఇవ్వడానికి సిద్థంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికే వెస్ట్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి కూడా తితిదే స్థలం ఇచ్చిన విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి ఈఓ తీసుకెళ్ళారు.
వెంటనే ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ కలుగజేసుకుని తిరుపతి రైల్వేస్టేషన్‌లో మరిన్ని అభివృద్థి కార్యక్రమాలు జరగాలని ఎస్కలేటర్, డార్మెటరీలు, టాయ్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరారు. దీనిపై ఆలోచిస్తానని కామినేనికి కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.