ఎదురుతిరిగిన దివ్య... అట్లకర్రతో వాతలు.. గుండు గీసి.. కనుబొమ్మలు తొలగించి...

గురువారం, 16 జులై 2020 (14:04 IST)
విశాఖపట్టణం జిల్లాలో సంచలనం రేపిన దివ్య హత్య కేసులోని నిజాలను పోలీసులు వెలికి తీశారు. వ్యభిచారం చేసినందుకు డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు దివ్య అనే యువతిని పలువురు కలిసి చిత్రహింసలు పెట్టి, దారుణంగా చంపేశారు. ఇంట్లో నిర్బంధించి, అట్లకర్రతో శరీరమంతా వాతలు పెట్టి, గుండు గీసి, కనుబొమ్మలు తొలగించి చంపేశారు. 
 
దివ్య అనే యువతిని ఎలా చంపేశారన్న అంశంపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన దివ్య అనే యువతి తల్లిదండ్రులు, ఆమె సోదరుడు మృతి చెందారు. దీంతో దివ్య పిన్ని క్రాంతివేణి వద్దకు చేరింది. 
 
ఒక ఏడాది కిందట దివ్యను ఎన్‌ఏడీ జంక్షన్‌లోని గీత అలియాస్‌ కుమారికి అప్పగించింది. దివ్య అందంగా ఉండటంతో కుమారి ఆమెతో వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదించసాగింది. అయితే, 8 నెలల క్రితం దివ్యను అక్కయ్యపాలెం చెక్కుడురాయి బిల్డింగ్‌ సమీపంలో ఉంటున్న గుట్టల వసంత అలియాస్‌ రాణికి అప్పగించింది. అప్పటినుంచి దివ్య వసంత ఇంట్లోనే ఉండసాగింది. 
 
వసంత సోదరి మంజు భర్త మృతిచెందడంతో సంజయ్‌ అనే యువకుడితో కలిసి వసంత ఇంటికి సమీపంలోనే ఉంటోంది. వీరిద్దరూ దివ్య కలిసి వ్యభిచారం చేస్తుండేవారు. దివ్య అందంగా ఉండడంతో వారిద్దరికంటే ఆమెకే డిమాండ్‌ ఎక్కువగా ఉండేది. అయితే దివ్యకు వసంతకు డబ్బులు పంపకంలో తేడాలు రావడంతో తాను బయటకు వెళ్లిపోతానని దివ్య ఎదురుతిరిగింది. 
 
దీంతో వసంత విషయాన్ని తన సోదరి మంజుకి చెప్పగా వారిద్దరూ కలిసి గంగవరంలోని తమ పెద్దమ్మ ధనలక్ష్మికి చెప్పడంతో ముగ్గురూ కలిసి దివ్యను బయటకు వెళ్లొద్దంటూ రాజీ ప్రయత్నాలు చేశారు. అయినా దివ్య తాను వెళ్లిపోతానని చెప్పడంతో మంజు ప్రియుడు సంజయ్‌తో కలిసి నలుగురూ దివ్యను ఒక గదిలో బంధించి గుండు చేసి, కనుబొమ్మలు తొలగించారు. 
 
అయినప్పటికీ వెళ్లిపోతానని చెప్పడంతో తిండి పెట్టకుండా ఇంట్లో నిర్బంధించి, అట్లకర్రతో శరీరంపై వాతలు పెట్టేవారు. బాధకు దివ్య అరవడం వల్ల బయటవారికి విషయం తెలిసిపోతుందనే భావనతో ఆమెకు నోట్లో గుడ్డలు కుక్కేసేవారు. తర్వాత  చపాతీకర్రతో విచక్షణారహితంగా బాదేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. 
 
ఈ క్రమంలో దివ్య ఈనెల మూడో తేదీ రాత్రి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా అంత్యక్రియలు చేయడానికి  వసంత సన్నాహాలు చేయగా వ్యాన్‌డ్రైవర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో విషయం బయటకు పొక్కింది. దివ్య మూర్ఛ వ్యాధితో చనిపోయిందని వసంత పోలీసులను మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ మృతదేహంపై గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ దర్యాప్తుతో పాటు.. పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం తెలిసింది. దివ్య శరీరంపై 33 గాయాలున్నాయని, చిత్ర హింసలకు గురిచేసి హత్యచేశారని తేలడంతో 4వ పట్టణ పోలీస్ ఇన్‌ఛార్జి సీఐ కొరాడ రామారావు, ఎస్‌ఐ సూర్యానారాయణ దర్యాప్తు ముమ్మరం చేసి ప్రధాన నిందితురాలు వసంత, ఆమె సోదరి మంజు, పెద్దమ్మ ధనలక్ష్మి, వీరికి సహకరించిన సంజయ్‌లతోపాటు దివ్యను వ్యభిచార కూపంలోనికి దింపిన ఆమె పిన్ని క్రాంతివేణి, వసంతకు ఆమెను అప్పగించిన గీతను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు