డాక్టర్ సుధాకర్ కేసు : మే 16న అసలేం జరిగింది...? వాంగ్మూలం గుట్టు ఇదే!
ఆదివారం, 24 మే 2020 (10:00 IST)
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో అనస్థీషియాగా పనిచేసే వైద్యుడు డాక్టర్ సుధాకర్ పట్ల వైజాగ్ పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన తీరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారాన్ని ఏపీ హైకోర్టు కూడా సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది. పైగా, డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసుల వ్యవహారశైలిపై సీబీఐ విచారణకు ఆదేశించింది. అంతకుముందు.. డాక్టర్ సుధాకర్ వాంగ్మూలాన్ని సేకరించి తమకు అందజేయాలంటూ విశాఖ 5వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ను స్వయంగా హైకోర్టు ఆదేశించింది. దీంతో మేజిస్ట్రేట్ స్వయంగా కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ సుధాకర్ వాంగ్మూలాన్ని నమోదు చేసి హైకోర్టుకు సమర్పించారు. ఆ సమయంలో మేజిస్ట్రేట్‌కు డాక్టర్ సుధాకర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలిస్తే,
'నేను 2013 ఏప్రిల్ 1 నుంచి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (అనస్థీషియా)గా పనిచేస్తున్నాను. ఏప్రిల్‌లో నార్మల్ సర్జికల్ మాస్కులు కావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ నీలవేణిని అడిగాను. స్టాక్ లేవన్నారు. విశాఖ వైద్య సేవల కోఆర్డినేటర్ నాయక్‌ని అడిగినా సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లోనే స్టాక్ లేవని చెప్పారు. నేను దీర్ఘకాలంగా మధుమేహం, బీపీ తదితర సమస్యలతో చికిత్స తీసుకుంటున్నాను. కరోనా నేపథ్యంలో సెలవుకు దరఖాస్తు చేయగా, ఎస్మా వల్ల తిరస్కరించారు. మా ఆసుపత్రిని కరోనా ఐసోలేషన్ కేంద్రంగా మార్చారు.
నర్సీపట్నం ఆర్డీవో ఆసుపత్రిని సందర్శించినప్పుడు మరోసారి మాస్కుల గురించి అడిగాను. అనస్థీషియా నిపుణుడికి మాస్క్ అవసరం లేదని సమాధానం ఇచ్చారు. ఏప్రిల్ 6న దగ్గు, జలుబు ఉన్న పేషంట్‌ను ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్‌కు తీసుకొచ్చారు. దాంతో సబ్‌స్టోర్ నుంచి ఎన్-95 మాస్కు అడగాలని స్టాఫ్‌కి చెప్పాను. రిజిస్టర్‌లో నా సంతకం తీసుకుని ఫార్మాసిస్ట్ ఎన్-95 మాస్క్ తీసుకొచ్చి, దానిని 15 రోజుల పాటు వాడాలని చెప్పాడు.
మాస్కులు లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్న ఆపరేషన్ థియేటర్ సిబ్బంది వీడియోలను సర్జరీ ముగిశాక మొబైల్ ద్వారా రికార్డు చేశాను. ఆ వీడియోలను చూపేందుకు హాస్పిటల్ కమిటీ ఛైర్మన్‌గా కూడా ఉన్న ఎమ్మెల్యే పెట్ల గణేశ్ వద్దకు వెళ్లాను. ఆయన మున్సిపల్ కార్యాలయంలో కరోనాపై మీటింగ్‌లో ఉన్నారని తెలిసి అక్కడకు వెళ్లాను. గంటపాటు ఆయనకోసం వేసి చూసినా ఫలితం లేకపోయింది.
దీంతో గత ప్రభుత్వంలో ఆసుపత్రి సలహా కమిటీ ఛైర్మన్‌గా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు వద్దకు వెళ్లాను. ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో కలవలేకపోయాను. మళ్లీ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాను. అక్కడ ఎన్-95 మాస్కులు ధరించి ఉన్న ఆర్‌డీవో ఎమ్మెల్యే, అడిషనల్ ఎస్పీ, సీఐ సోమునాయుడులను కలిశాను.
మా సూపరింటెండెంట్ నీలవేణి మాత్రం సింపుల్ సర్జికల్ మాస్క్ ధరించివున్నారు. నేను ఆపరేషన్ థియేటర్ సిబ్బంది కోసం ఎన్-95 మాస్కు అడగ్గానే వారు ఆగ్రహం చెందారు. నన్ను దూషిస్తూ మీటింగ్ నుంచి గెంటేశారు. ఇది చూసిన మీడియా సిబ్బంది ఏం జరిగిందంటూ చుట్టుముట్టారు. దీంతో జరిగిన విషయం చెప్పాను.
ఏప్రిల్ 8వ తేదీ వేకువజామున 5 గంటలకు అంబులెన్స్ డ్రైవర్ రాము నుంచి నా సస్పెన్షన్ ఆర్డర్ అందుకున్నాను. పదిరోజుల క్రితం (20వ తేదీ) పోర్ట్ ట్రస్టు హాస్పిటల్ వెనుకవైపు సమీపంలో స్కోడా కారులో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మా అబ్బాయి బుల్లెట్ బైక్‌ను సీజ్ చేశారు. అది జరిగిన 3 రోజుల తర్వాత 4వ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోయిన నా కుమారుడి వాహనం గురించి అడిగాను.
ఈ సమయంలో ఒక మహిళా కానిస్టేబుల్ వచ్చి నా చేయి పట్టుకుని తనను వదలాలంటూ ఏడ్చింది. దీంతో పోలీసులు నన్ను కొట్టారు. ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేలా తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరించారు. నా కుమారుడు లాక్డౌన్ సమయంలో వాహనం నడిపినట్లుగా కేసు నమోదు చేశారు. నా బ్యాగులో ఉన్న నా మొబైల్, కారు తాళాలు, వెయ్యి రూపాయల నగదు తీసుకుని నన్ను పంపించేశారు.
16న ఏం జరిగిందంటే..
ఇదిలావుంటే, ఈ నెల 16వ తేదీన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వారికి చెక్కు ఇచ్చేందుకు అనకాపల్లిలో ఉన్న ఆంధ్రాబ్యాంకులో రూ.10 లక్షలు డిపాజిట్ చేసేందుకు బయలుదేరాను. మధ్యాహ్నం సుమారు 2 గంటల ఒకరు లిఫ్ట్ అడిగారు. ఒకరు బైక్‌పై నన్ను అనుసరించడం గుర్తించాను. దోపిడీ భయంతో అనకాపల్లి వెళ్లరాదని నా మనసు మార్చుకున్నాను. ఇంటికెళ్లాలని నిశ్చయించుకుని రైట్‌టర్న్ తీసుకున్నాను.
నేను మధుమేహ బాధితుడిని అయినందున మూత్ర విసర్జన చేయడం కోసం పోర్ట్ హాస్పటల్ సమీపంలో కారు ఆపాను. ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు నా వద్దకు వచ్చి నా సస్పెన్షన్ గురించి ఇతర విషయాల గురించి అడుగుతూ నన్ను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. కారు నుంచి తాళాలు, మొబైల్, ఏటీఎం కార్డులతో ఉన్న పర్సు తీసుకున్నారు. నా చొక్కా చించి, నన్ను అర్థనగ్నంగా చేశారు. రక్షక్‌కు ఫోన్ చేశారు. కారు ఫ్రంట్ సీటులో ఉన్న రూ.10 లక్షలు తీసుకుని, మూడు విస్కీ బాటిళ్లను పెట్టారని గమనించాను.
లాఠీలు, బూటు కాళ్లతో, చేతులతో ఇష్టానుసారంగా కొట్టారు. నేను అక్కడి నుంచి పారిపోయేలా చేయాలని చూశారు. నేను తాగిన స్థితిలో ఉన్నానని, పిచ్చివాడినని సృష్టించడానికి వారు కేకలేశారు. నన్ను ఉద్యోగం నుంచి తొలగించడానికి కుట్ర ఉందని సందేహించాను.
ఆటోరిక్షాలో నన్ను 4వ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్‌లో రెండు గంటలపాటు నా చేతులు వెనక్కి కట్టి నేలమీద పడేశారు. టీవీ చానళ్లలో వార్తలు చూసి ఇండియన్ మెడికల్ అసోసియేన్(ఐఎంఏ) అధ్యక్షుడు పోలీస్ స్టేషన్‌కు వస్తే లోపలికి అనుమతించలేదు. సమాచారం తెలిసి నా తల్లి స్టేషన్‌కు వచ్చింది. నన్ను కేజీహెచ్‌కు మార్చారు. రెండు గంటల తరువాత కేజీహెచ్ క్యాజువాలిటీ నుంచి ఈ మానసిక వైద్యశాలకు మార్చారు అంటూ డాక్టర్ సుధాకర్ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. పోలీసుల దాడి కారణంగా తగిన గాయాలను కూడా న్యాయమూర్తికి ఆయన చూపించి కన్నీరు పెట్టుకున్నారు.