టెక్నాలజీతో ప్రభుత్వ సేవలన్నీ ఇంటికే చేరుస్తాం.. మంత్రి మేకపాటి

శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (19:04 IST)
ప్రపంచ స్థాయిలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుందని, మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని  ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటికి చేరుస్తామని ఐ.టి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

విజవాడలోని తాజ్ గేట్ వే హోటల్ లో.. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఆధ్వర్యంలో బిల్డింగ్ న్యూ ఇండియా లెవరేజింగ్ జియో స్పేషియల్ టెక్నాలజీ వర్క్ షాప్ లో మంత్రి అతిథిగా  హాజరై మాట్లాడారు. టెక్నాలజీ చాలా ఖర్చుతో కూడుకున్నదని మంత్రి అభిప్రాయపడ్డారు.

1960-70 దశకంలో టెక్నాలజీ మరింత వ్యయ భారంగా ఉండేదని మంత్రి అన్నారు. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులతో గతంలో చదువుకున్న రోజులని పోల్చిచూస్తే స్పష్టంగా అర్ధం అవుతుందన్నారు మంత్రి.

ఇపుడు ఇంజనీరింగ్ చదివి బయటకి వచ్చే విద్యార్థుల్లో 60 శాతం మంది టెక్నాలజీతో సంబంధంలేని ఉద్యోగాలు చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. దీనికి కారణం విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, టెక్నాలజీని అందిపుచ్చుకునే వెసులుబాటు, బోధన, శిక్షణ వంటివి వారికి అందుబాటులో లేకపోవడమేనని మంత్రి అన్నారు.

విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం పెంచే సిలబస్ మున్ముందు ప్రవేశపెట్టాలన్నారు. ఇప్పటికే యువతకు ప్రభుత్వమే ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించేందుకు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 25 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

రాష్ట్రంలో జియో స్పేషియల్ సెంటర్ ఏర్పాటుకు కూడా కృషి చేస్తామన్నారు.  టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రజలకు సేవలందించించడంలో రెవెన్యూ శాఖ దేశంలోనే ముందుందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాక్ బృందం సేవలు బాగున్నాయని కితాబిచ్చారు.

జియో స్పేషియల్ టెక్నాలజీతో ఇప్పటికే రెవెన్యూ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖల్లో విస్తృత సేవలు ప్రజలకు అందుతున్నాయని, ముందు ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలలోనూ టెక్నాలజీని వినియోగించుకుని, ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేస్తామని మంత్రి వెల్లడించారు.

టెక్నాలజీని ఎంత చేరువ చేస్తే ప్రజలకు అంత సౌకర్యంగా ఉంటుందన్నారు. గ్రామాల సరిహద్దుల వంటి సమస్యలు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన దృష్టికి వచ్చాయని, వాటిని పరిష్కరించేందకు అవసరమైన సాంకేతికత లేకపోవడం గమనించానన్నారు.

ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్ భారతదేశ సర్వేయర్ జనరల్, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఐ.టీ శాఖ ముఖ్యకార్యదర్శి అనూప్ సింగ్, 'జియో స్పేషియల్ మీడియా, కమ్యూనికేషన్స్' వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ జోషి, ట్రింబుల్ ఇండియా సంస్థ డైరెక్టర్ సంజీవ్ ట్రెహన్‌,ఏపీఎస్ఎసి వైస్ ఛైర్మన్ ఎ.నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు