Black water: Shruti Haasan, Kajal Aggarwal, Malaika Arora వంటి చాలామంది అందగత్తెలు తాగే ఈ నీటి ప్రత్యేకత ఏమిటి?
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (21:21 IST)
ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కథానాయిక కాజల్ అగర్వాల్ తన చేతిలో బ్లాక్ వాటర్ బాటిల్‌తో కనిపించారు. ఆ బాటిల్‌లో నీటి ప్రత్యేకత ఏమిటి?అని విలేఖరులు ప్రశ్నించినప్పుడు, ఆమె నవ్వుతూ.. ఇదీ మంచి నీరే. ఒకసారి వీటిని తాగిచూడండి. మీకూ నచ్చుతాయిఅని ఆమె సమాధానం ఇచ్చారు. ఎప్పటి నుంచి వీటిని తాగుతున్నారని అడిగినప్పుడు.. చాలా రోజుల నుంచీ అని ఆమె అన్నారు. కొన్ని రోజులకు ముందు సోషల్ మీడియా వేదికగా తాను కూడా బ్లాక్ వాటర్ తాగుతున్నట్లు కథానాయిక శ్రుతి హాసన్ కూడా వెల్లడించారు.
బ్లాక్ వాటర్ గ్లాసును చూపిస్తూ ఆమె ఒక వీడియో చేశారు. ఈ బ్లాక్ వాటర్ గురించి తెలుసుకున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. నిజానికి ఇది బ్లాక్ వాటర్ కాదు. ఆల్కలీన్ వాటర్. దీని రుచి మామూలు మంచి నీటిలానే ఉంటుందిఅని ఆమె వీడియోలో చెప్పారు. అంతకుముందు నటి మలైక అరోరా, ఊర్వశి రౌతెలా తదితరులు ఈ బ్లాక్ వాటర్‌ను తాగుతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఏమిటీ బ్లాక్ వాటర్?
బ్లాక్ వాటర్‌నే ఆల్కలీన్ వాటర్ లేదా ఆల్కలీన్ అయోనైజ్డ్ వాటర్ (ఏకేడబ్ల్యూ)గా పిలుస్తారు. సాధారణంగా వ్యాయామం తర్వాత లేదా చెమట విపరీతంగా విడుదలైన తర్వాత శరీరానికి ఎలక్ట్రోలైట్‌లను అందించేందుకు దీన్ని తీసుకుంటే కొంతవరకు ఉపయోగం ఉంటుందని ఎవిడెన్స్ బేస్డ్ క్లాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ (ఈబీసీఏఎం) చెబుతోంది. శరీర బరువు సరిగ్గా ఉండేలా సరిచూసుకోవడంలో ఆల్కలీన్ వాటర్ తోడ్పడుతుందని ఎలుకలపై చేపట్టిన ఇదివరకటి అధ్యయనాల్లో తేలినట్లు ఈబీసీఏఎం పేర్కొంది. దీని వల్ల జీవక్రియ రేటు పెరిగే అవకాశముందని వివరించింది. మరోవైపు పీహెచ్ స్థాయి ఏడు కంటే ఎక్కువగా ఉండే ఈ బ్లాక్ వాటర్.. వయసు పైబడే ఛాయలను కూడా తగ్గిస్తుందని కొన్ని సంస్థలు తమ ప్రకటనల్లో చెబుతున్నాయి. అయితే, ఈ విషయాన్ని ధ్రువీకరించే ఆధారాలేమీ తమకు లభించలేదని ఈబీసీఏఎం పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు.
వీటిలో ఏం కలుపుతారు?
మన శరీరంలో 70 శాతం ఉండేది నీరే. కాబట్టి శరీరంలోని వ్యవస్థలన్నీ సవ్యంగా పనిచేసేందుకు నీరు తగిన మొత్తంలో తీసుకోవడం చాలా అవసరం. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించడంలో నీరు ఉపయోపడుతుంది. మరోవైపు శరీర ఉష్ణోగ్రతను సక్రమంగా ఉండేలా చూడటం, మినరల్స్‌ను భిన్న అవయవాలకు సరఫరా అయ్యేలా చూడటం, మనం తీసుకునే ఆహారం జీర్ణం కావడంలోనూ ఇది క్రియాశీల పాత్ర పోషిస్తుంది. ఈ ప్రక్రియలు మెరుగ్గా జరిగేలా చూసేందుకు బ్లాక్‌వాటర్‌లో 70కిపైగా మినరల్స్‌ను కలుపుతున్నట్లు సదరు సంస్థలు చెబుతున్నాయి. మెగ్నిషియం, కాల్షియం లాంటి మినరల్స్ దీనిలో ఉంటున్నాయి. అయితే, ఇవి ఒక్కో కంపెనీ వాటర్‌లో ఒక్కోలా ఉంటున్నాయి. అయితే, మొత్తంగా ఇవి జీవక్రియారేటును పెంచడం, జీర్ణశక్తికి మెరుగు చేయడం, ఆసిడిటీని తగ్గించడం, రోగ నిరోధక శక్తిని పెంపొదించడం లాంటి చర్యలకు తోడ్పడుతుందని ఆయా సంస్థలు చెబుతున్నారు.
మంచి నీటికి దీనికి తేడా ఏంటి
మనం రోజువారీగా తీసుకునే మంచినీటిలో కొన్ని మినరల్స్ తక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి అందడం చాలా కీలకం. ఒక్కోసారి వీటి లోపాల వల్ల వ్యాధులు కూడా చుట్టుముడుతుంటాయిఅని డైటీషియన్ డా. రూత్ జయశీల చెప్పారు. ఆర్‌వో వాటర్‌లో పీహెచ్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. పైగా ఆమ్ల స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దీంతో శరీరం దీన్ని ప్రాసెస్ చేయడం ఒక్కోసారి కష్టం అవుతుంటుంది. దీని వల్ల కొన్నిసార్లు విటమిన్లు, సప్లిమెంట్లను విడిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వారికి ఈ బ్లాక్ వాటర్ కొంత వరకు ఉపయోగపడొచ్చు. అయితే, సహసిద్ధమైన ప్రత్యామ్నాయాలు ఎప్పుడూ వీటికంటే మెరుగ్గా పనిచేస్తయని మనం గుర్తుపెట్టుకోవాలిఅని ఆమె వివరించారు.
ఏదైనా ఆహారం లేదా పానీయం ఆమ్ల (యాసిడిక్) లేదా క్షార (ఆల్కలైన్) స్థాయిలను పీహెచ్‌తో గుర్తిస్తారు. దీనిలో 0 నుంచి 14 వరకు రీడింగ్స్ ఉంటాయి. పీహెచ్ విలువ ఒకటి ఉందంటే ఆ నీటిలో ఆమ్ల స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాలి. అదే పీహెచ్ ఏకంగా 13 ఉంటే ఆ నీటిలో క్షార స్థాయిలు విపరీతంగా ఉన్నట్లు లెక్క. సాధారణంగా మనం తాగే మంచి నీటికి పీహెచ్ స్థాయి 6 నుంచి 7 మధ్యలో ఉంటుంది. అయితే, ఆల్కలైన్ వాటర్ పీహెచ్ స్థాయిలు ఏడుకుపైనే ఉంటాయి. అంటే సాధారణ మంచినీటితో పోల్చినప్పుడు వీటిలో క్షార స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు లెక్క. అయితే, కేవలం పీహెచ్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఆ నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పలేం. నీటిలో ఉండే మినరల్స్‌పైనే ఈ మొత్తం ఆధారపడి ఉంటుంది. అది కూడా ఆ మినరల్స్ ఎలా శరీరానికి చేరుతున్నాయనేది ముఖ్యంఅని జయశీల చెప్పారు.
ఎవరికి ఉపయోగం?
కొన్ని వ్యాధులతో బాధపడేవారికి ఈ ఆల్కలీన్ వాటర్‌తో కొంతవరకు మేలు జరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు మన కడుపులో యాసిడ్ సమస్యకు పెప్సిన్ అనే ఎంజైమ్ కారణం అవుతుంది. దీని అచేతన స్థితిలోకి తీసుకెళ్లడానికి పీహెచ్ 8.8 కంటే ఎక్కువగా ఉండే ఆల్కలైన్ మినరల్ వాటర్ తోడ్పడుతుందని అమెరికాలోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. మరోవైపు ఆల్కలైన్ ఎలక్ట్రోలైజ్డ్ వాటర్ తీసుకోవడంతో జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని, మలబద్ధక సమస్య కూడా తగ్గుతుందని 2018లో జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిపుణులు చేపట్టిన అధ్యయనంలో తేలింది.
సాధారణ నీటితో పోల్చినప్పుడు పీహెచ్ ఎక్కువగా ఉండే ఆల్కలైన్ వాటర్‌ను తీసుకున్నప్పుడు రక్త నాళాల్లో రక్త ప్రవాహం మెరుగయ్యేందుకు తోడ్పడుతుందని అమెరికాలోని థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ నిపుణులు పరిశోధనలో వెల్లడైంది. అయితే, పైన పేర్కొన్న మూడు అధ్యయనాలు తక్కువ మందిపై చేపట్టినవని, వీటి ఫలితాలు ధ్రువీకరించేందుకు లోతైన పరిశోధన అవసరమని వైద్య వార్తల వెబ్‌సైట్ ద హెల్త్‌లైన్ విశ్లేషించింది.
దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా?
మరోవైపు బ్లాక్ వాటర్‌తో దీర్ఘకాలంలో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నీటిని మరీ ఎక్కువగా తాగితే, వికారం, వాంతులు, శరీర ద్రవాల పీహెచ్ స్థాయిల్లో మార్పుల లాంటివి వచ్చే అవకాశముందని ఫిన్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టుర్కు ప్రొఫెసర్ మరీనా మెర్న్ నేతృత్వంలో చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. మరోవైపు మినరల్స్ ఎక్కువగా తీసుకున్నా ముప్పేనని డైటీషియన్ నీతా దిలీప్ చెప్పారు. మినరల్స్ ఆరోగ్యానికి మంచివే. అయితే, అతిగా తీసుకుంటే అవి విషంగా మారే ముప్పుంటుంది. అదే సమయంలో ఇవి తక్కువైనా జబ్బులు వస్తాయిఅని నీతా వ్యాఖ్యానించారు.
కాల్షియం ఎక్కువైతే హైపర్‌కాల్సీమియా రావొచ్చు. ఐరన్ ఎక్కువైతే హేమోక్రోమాటోసిస్ వస్తుంది. కాబట్టి ఏదైనా తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అతిగా తీసుకుంటే ప్రాణాలకే ముప్పుఅని ఆమె చెప్పారు. సెలబ్రిటీలు వీటిని తీసుకుంటున్న మాట వాస్తవమే. అయితే, వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. వారికంటూ వ్యక్తిగత నిపుణులు, డైటీషియన్‌లు ఉంటారు. ఎవరో వాడుతున్నారని మనం కూడా మొదలుపెట్టకూడదు. ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా ఉంటుంది. అన్ని విషయాలనూ మనం పరిగణలోకి తీసుకోవాలిఅని ఆమె వివరించారు.
ధర ఎంత?
భారత్‌లో ఎక్కువగా కనిపించే బ్లాక్ వాటర్ బ్రాండ్లలో ఇవోకస్ ఒకటి. మలైకా అరోరా చేతిలో కనిపించిన బ్యాటిల్ ఈ బ్రాండ్‌దే. 500 మిల్లీ లీటర్ల ఆరు బాటిళ్లను ప్రస్తుతం సంస్థ రూ.600కు విక్రయిస్తోంది. ఒక బాటిల్‌లో 32 మి.గ్రా. కాల్షియం, 21 మి.గ్రా. మెగ్నిషియం, 8 మి.గ్రా. సోడియం ఉంటాయని గుజరాత్‌కు చెందిన ఈ సంస్థ వెల్లడించింది. మరోవైపు వైద్య రిషి మరో బ్లాక్‌వాటర్ బ్రాండ్ కూడా ఆన్‌లైన్ మంచి నీళ్లను అమ్ముతోంది. ఈ సంస్థ కూడా ఆరు 500 మిల్లీ లీటర్ల బాటిళ్లను రూ.594కు విక్రయిస్తోంది. మొత్తంగా ఈ బ్లాక్ వాటర్ ధర అర లీటరుకు రూ.100కు అటూఇటూగా ఉంటోంది.
మనం తీసుకోవచ్చా?
బ్లాక్ వాటర్ మితంగా తీసుకోవడంలో ఎలాంటి ప్రమాదమూ ఉండదని నిపుణులు అంటున్నారు. అయితే, ఇక్కడ బ్లాక్ వాటర్‌లోని మినరల్స్ ఎంత మొత్తంలో శరీరం తీసుకోగలుగుతోందనేది అతి ముఖ్యమైన విషయమని వారు చెబుతున్నారు. మీరు బ్లాక్ వాటర్ తీసుకున్నప్పటికీ, అందులోని మినరల్స్‌ను శరీరం గ్రహించకపోతే ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఎందుకంటే మన ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా ఉంటుందిఅని నీతా చెప్పారు. నిజంగా మినరల్స్ శరీరానికి అందించాలని అనుకుంటే, సహజసిద్ధమైన విధానాలను ఎంచుకోవాలని ఆమె సూచించారు.
ఎప్పుడైనా లైవ్ ఫుడ్స్.. అంటే, జీవం ఉండేవి తీసుకోవాలి. ఉదాహరణకు మొలకలు, తాజా పళ్లు కూరగాయలు తీసుకోవాలి. వీటిలో ఎంజైమ్స్ యాక్టివ్ ఫామ్‌లో ఉంటాయి. వీటిని శరీరం మెరుగ్గా గ్రహించగలుగుతుందిఅని ఆమె చెప్పారు. మన పూర్వీకులు ఇలాంటివి వాడటం మీరు ఎప్పుడైనా చూశారా? కానీ, వారు మనకంటే ఆరోగ్యంగా ఉండేవారు. ఈ ఉదాహరణను పరిశీలిస్తే, ఏదైనా సహజసిద్ధమైనవి మేలని తెలుస్తుందిఅని నీతా వివరించారు. బ్లాక్ వాటర్‌కు బదులు మనకు సహజసిద్ధమైన ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయని డా. జయశీల చెప్పారు. నిమ్మకాయ నీరు, గ్రీన్ టీ, సబ్జా గింజల నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా రాత్రిపూట కీరా, పళ్ల ముక్కలు నానబెట్టిన నీళ్లను మరుసటి రోజు ఉదయం తాగితే కావాల్సిన మినరల్స్ అవే అంతుదాయని ఆమె చెప్పారు.