డిప్రెష‌న్‌: ఇలియానా, షారుక్ ఖాన్, దీపిక పదుకొణె‌, అనుష్క శర్మలను పీడించిన మానసిక రుగ్మత.. లక్షణాలివే

సోమవారం, 15 జూన్ 2020 (21:43 IST)
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) ఆరు నెల‌లుగా డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్నార‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఆయ‌న ఆత్మహ‌త్య‌కు గ‌ల కార‌ణాలు స్ప‌ష్టంగా తెలియ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. మ‌ర‌ణానికి డిప్రెష‌న్‌ ప్రేరేపించి ఉండొచ్చ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

 
ప్ర‌ముఖుల నుంచి సామాన్యుల వ‌ర‌కూ చాలామంది డిప్రెష‌న్‌లో కూరుకుపోయిన‌ట్లు ఎప్ప‌టిక‌ప్పుడే వార్త‌లు వ‌స్తుంటాయి. తమ‌ను ఈ మాన‌సిక రుగ్మత కుంగ‌దీసింద‌ని షారుఖ్‌‌ ఖాన్‌, దీపికా ప‌దుకొణె, అనుష్క శ‌ర్మ‌, ఇలియానా త‌దిత‌ర బాలీవుడ్ ప్ర‌ముఖులు బ‌హిరంగంగానే వెల్ల‌డించారు.

 
భార‌త్‌లో డిప్రెష‌న్ లాంటి మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఎంత మంది స‌త‌మ‌తం అవుతున్నారు? వారిలో ఎంత మందికి వైద్యం అందుతోంది? ఇంత‌కీ డిప్రెష‌న్‌ను గుర్తించ‌డం ఎలా? ఈ రుగ్మ‌త‌కు గురైతే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి? దీన్నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలి?

 
ఎంత మందిని పీడిస్తోంది?
మాన‌సిక స‌మ‌స్య‌ల‌పై 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్' 2016లో భార‌త్‌లోని 12 రాష్ట్రాల్లో సర్వే చేప‌ట్టింది. ఈ సర్వే ప్రకారం భార‌త్‌లో 14 శాతం మంది ప్రజలు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. వీరిలో10 శాతం మందికి సత్వర వైద్య సహాయం అందించాల్సిన‌ అవసరముంది.

 
మ‌రోవైపు 20 శాతం మంది భార‌తీయులు త‌మ జీవితంలో ఏదో ఒక‌సారి డిప్రెష‌న్ బారిన ప‌డుతున్నార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) కూడా వెల్ల‌డించింది. సైన్స్ జర్నల్ లాన్సెట్‌లో ప్రచురితమైన ఒక నివేదిక.. భార‌త్‌లో మానసిక వైద్య సహాయం అవసరమైన ప్రతి 10 మందిలో కేవలం ఒక్కరే సేవలు పొందగలుగుతున్నారని చెప్పింది. ఇది ఇలాగే కొనసాగితే పదేళ్ల తరువాత ప్రపంచంలో మానసిక సమస్యల బారినపడినవారిలో మూడింట ఒక వంతు భారతీయులే ఉండొచ్చని ఆ నివేదిక అంచనా వేసింది.

 
అస‌లు ఏమిటీ వ్యాధి?
డిప్రెష‌న్ ఒక మాన‌సిక రుగ్మ‌త‌. దీన్నే కుంగుబాటు అని పిలుస్తారు. మ‌హిళ‌లు.. పురుషులు, చిన్నా.. పెద్దా ఇలా ఎలాంటి భేదం లేకుండా ఎవ‌రికైనా ఇది రావొచ్చు. బాధ‌, కోపం, నిరుత్సాహం, ఆందోళ‌న లాంటి భావోద్వేగాలు అంద‌రికీ వ‌స్తుంటాయి. అయితే డిప్రెష‌న్ బాధితుల్లో ఇవి దీర్ఘ‌కాలం ఉంటాయి. అంతేకాదు వారి జీవితాన్ని ఇవి తీవ్రంగా ప్ర‌భావితం చేస్తుంటాయి.

 
కుంగుబాటు చాలా కార‌ణాల వ‌ల్ల‌ వ‌స్తుంది. ఇది వ్య‌క్తిని బ‌ట్టీ మారుతుంటుంది. అయితే ఆప్తుల్ని కోల్పోవ‌డం, భాగ‌స్వామి దూరం కావ‌డం, పెద్ద‌పెద్ద‌ జ‌బ్బులు.. లాంటి తీవ్రంగా కుంగ‌దీసే ప‌రిణామాల వ‌ల్లే ఎక్కువ మంది డిప్రెష‌న్ బాధితులుగా మారుతుంటారు. మెనోపాజ్‌, నిద్ర స‌మ‌స్య‌లు, కొన్ని ఔష‌ధాల దుష్ప్ర‌భావం, మంచి ఆహారం తీసుకోక‌పోవ‌డం, ఫిట్‌నెస్ లేకపోవ‌డం లాంటివీ కుంగుబాటు ముప్పును పెంచుతాయి. కొన్నిసార్లు జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల వ‌ల్లా కుంగుబాటు సంక్ర‌మిస్తుంది.

 
ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి?
డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు చాలా ఉంటాయి. ఇవి ఒక్కొక్క‌రిలో ఒక్కోలా క‌నిపిస్తుంటాయి. అయితే, అందరిలోనూ క‌నిపించే కొన్ని ల‌క్ష‌ణాలు ఇవి..

 
భావోద్వేగాలు
దీర్ఘ‌కాలం బాధలో ఉండ‌టం
ఎప్ప‌టిక‌ప్పుడే ఏడుపు వ‌స్తున్న‌ట్లు అనిపించ‌డం
త‌ర‌చూ నిరాశ ఆవ‌హించ‌డం
స‌ర్వం కోల్పోయిన‌ట్లు అనిపించ‌డం
ఎక్కువ‌గా ఆందోళ‌న ప‌డ‌టం
చిన్న‌చిన్న విష‌యాల‌కే చిరాకు ప‌డ‌టం
స‌హ‌నం కోల్పోవ‌డం
ఇష్ట‌ప‌డే ప‌నుల‌నూ ఆస్వాదించ‌లేక‌పోవ‌డం
ఏదో త‌ప్పు చేసిన భావ‌న క‌ల‌గ‌డం

 
ఆలోచ‌న‌లు
ప్ర‌తికూల ఆలోచ‌న‌లు ఎక్కువ‌గా రావ‌డం
ఏకాగ్ర‌త చూప‌లేక‌పోవ‌డం
ఆత్మ‌న్యూన‌తా భావాలు
నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోవ‌డం
కొన్నిసార్లు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న‌లూ చుట్టుముట్ట‌డం

 
ప్ర‌వ‌ర్త‌నా ప‌ర‌మైన‌..
ఇష్ట‌ప‌డే ప‌నుల‌నూ ప‌క్క‌న పెట్టేయ‌డం
త‌ర‌చూ చేసే, అల‌వాటుప‌డిన ప‌నుల‌పై అశ్ర‌ద్ధ‌
కుటుంబం, స్నేహితుల‌ను దూరంగా పెట్ట‌డం
ఆఫీసులో‌ ప‌నిచేయ‌డానికి ఇబ్బంది ప‌డ‌టం
త‌న‌కు తానే హాని చేసుకోవ‌డం

 
శారీర‌క ప‌ర‌మైన ల‌క్ష‌ణాలు
నిద్ర ప‌ట్ట‌క పోవ‌డం
నిస్స‌త్తువ ఆవ‌రించ‌డం
ఆక‌లి లేక‌పోవ‌డం
బ‌రువు త‌గ్గ‌డం
కార‌ణం లేకుండా నొప్పులు రావ‌డం

 
ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏం చేయాలి?
ఈ ల‌క్ష‌ణాలు సాధార‌ణంగా చాలా మందిలో క‌నిపిస్తాయి. అయితే ఇవి దీర్ఘ‌‌కాలం ఉంటే వైద్యుల‌ను సంప్ర‌దించాలి. మాన‌సిక నిపుణులైతే ఇంకా మంచిది. రెండు వారాల కంటే ఎక్కువ రోజులు ఈ ల‌క్ష‌ణాలు ప‌దేప‌దే క‌నిపిస్తే.. ఎలాంటి ఆల‌స్యం లేకుండా వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాలి. అంతేకాదు ఈ ఆలోచ‌న‌ల గురించి స్నేహితులు, బంధువులు ఇలా ఎవ‌రో ఒక‌రితో మాట్లాడాలి.

 
ప‌క్క‌నుండే వారిలో ఈ డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏం చేయాలంటే.. మొద‌ట వారు చెప్పేవన్నీ జాగ్ర‌త్త‌గా వినాలి. ఒక్కోసారి మాట్లాడ‌టం, భావాల‌ను పంచుకోవ‌డం కూడా డిప్రెష‌న్ త‌గ్గేందుకు స‌హాయ ప‌డ‌తాయి. అయితే, వినేట‌ప్పుడు ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌దు. వారిని ప్రోత్స‌హించేలా, భావాల‌ను పంచుకొనేలా మాట్లాడాలి. డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లేలా డిప్రెష‌న్ బాధితుల్ని ప్రోత్స‌హించాలి. అయితే 'ఎంజాయ్ చెయ్‌', 'చీర్ అప్' లాంటి ప‌దాల‌ను వారికి చెప్ప‌కపోవ‌డ‌మే మంచిది.

 
చికిత్స ఇలా..
డిప్రెష‌న్ రోగుల‌ను.. స్వ‌ల్ప‌, మధ్య‌స్థం, తీవ్రం అనే మూడు కేట‌గిరీలుగా విభ‌జిస్తారు. వీటి ఆధారంగానే వైద్యులు చికిత్స అందిస్తారు. సాధార‌ణంగా ఎక్కువ మందికి కాగ్నిటివ్ బిహేవియ‌ర‌ల్ థెర‌పీ (సీబీటీ)తో చికిత్స ప్రారంభిస్తారు. ఇది ఒక కౌన్సెలింగ్ ప్ర‌క్రియ‌. దీనిలో భాగంగా నెగెటివ్ ఆలోచ‌న‌లు, తీవ్ర‌మైన బాధ‌కు కార‌ణాలు గుర్తించి.. వాటిని అధిగ‌మించేందుకు వైద్యులు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తుంటారు.

 
ప్ర‌తికూల ఆలోచ‌న‌ల మూలాల‌తోపాటు వాటిని అధిగ‌మించే మార్గాలూ తెలుసుకోవ‌డం ద్వారా.. ప్ర‌తికూల ప్ర‌వ‌ర్త‌న‌ల జోలికి పోకుండా అడ్డుకోవ‌చ్చు. కుంగుబాటు తీవ్రంగా ఉంటే.. యాంటీ-డిప్రెసెంట్ ఔష‌ధాల‌ను వైద్యులు సూచిస్తారు. ఇవి భావోద్వేగాల‌ను ప్ర‌భావితం చేసే మెద‌డులోని ర‌సాయ‌న చ‌ర్య‌ల‌ను క్రియాశీలం చేస్తాయి. దీంతో కొంత‌వ‌ర‌కు నిస్సత్తువ‌‌, నిరాశ‌, భావోద్వేగ స‌మ‌స్య‌ల‌ను అడ్డుకోవ‌చ్చు. అయితే ఈ ఔష‌ధాల‌తో కొన్ని ప్ర‌తికూల ప్ర‌భావాలూ ఉంటాయి. కొంతమంది రోగుల‌కు ధ్యానం, వ్యాయామం, మ్యూజిక్‌, ఆర్ట్ థెర‌పీల‌ను సూచిస్తారు.
 
మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు