గొల్లపూడి మారుతీరావు (1939-2019): "ఒక్క జీవితంలోనే పది జీవితాలు చూసిన గొప్ప రచయిత" - అభిప్రాయం
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (16:22 IST)
గొల్లపూడి మారుతీరావు నాకు 1976-77 నుంచి పరిచయం. అప్పటికే ఆయన చాలా పేరున్న రచయిత. రేడియోలో పని చేస్తుండేవారు. ఎందుకో తెలియదుగాని మొదటి పరిచయంలోనే, ఇష్టమో అభిమానమో, చిన్నవాడిని రాయటానికి వచ్చాను కదా అన్న సరదాయో... తను నన్ను దగ్గరకు తీసుకున్నారు. నేనంటే ఇష్టం ఏర్పడింది.
నా రెండో సినిమా 'దేవుడు చేసిన పెళ్లి'. నిర్మాత అట్లూరి పూర్ణచంద్ర రావు, దర్శకుడు తాతినేని మాధవరావు నా దగ్గరకు వచ్చి ఆ సినిమా గురించి చెప్పారు. దానికి మారుతీరావు కథ అందించారు. నేను అభిమానించే గొప్ప నవలాకారుడి కథకు నేను మాటలు రాస్తున్నాను. చాలా ఆనందం వేసింది. దర్శకుడు మాధవరావు సహా మేం ముగ్గురం ఈ సినిమా చర్చలకు కూర్చునేవాళ్లం. ఎక్కువగా నేనూ, మారుతీరావు కూర్చునేవాళ్ళం.
ఆయన ఆ కథ గురించే కాకుండా ప్రపంచ సాహిత్యం, ప్రపంచ సినిమా, రేడియో, నాటికలు, నాటకాల గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు. అప్పటికే ఆయన మాటల రచయితగా 'ఓ సీత కథ' వంటి సినిమాలకు చేశారు. ఆయన రేడియో నుంచి మాటల రచయితగా మారారు. సినిమా చర్చల్లో మేమిద్దరం మాట్లాడుకోవడం, ఆయనొకటి చెప్పడం, నేనొకటి అనడం ఇలా ఒక జుగల్బందీగా ఉండేది. ఆయన అప్పటికే మాటల రచయిత కాబట్టి ఆయన ఆశువు(స్పాంటేనియస్)గా డైలాగులు చెప్పేవారు.
ఆయన కథలు, నాటకాలు, నవలలు అన్నీ చదివాను. చాలా గొప్ప రచయిత. సీరియస్ విషయాలు రాయాలి అంటే ఎంతో ప్రామాణికంగా రాసేవారు. అంటే పది జీవితాలు చూసిన ఒక మనిషి ఎంత గొప్పగా రాయగలరో, ఆయన ఒక్క జీవితంలోనే అంత గొప్పగా రాశారు. ఆయన రచనల్లో 'సీరియస్‌నెస్' ఎంత బావుంటుందో వినోదం, హాస్యం అంతే బాగుంటాయి. ఆశువుగా రాసే చిన్నచిన్న డైలాగులు కూడా అంతే బాగుంటాయి.
ఆయన చాలా గొప్ప నాటకాలు రాశారు. అందులోనూ మరీ ముఖ్యంగా 'కళ్లు' నాటకం. అది నాకెంతో ఇష్టం. అది ఎప్పటికీ మిగిలిపోయే నాటకం. కెమెరామెన్ రఘు మొదటిసారి సినిమా దర్శకత్వం వహించి ఆ నాటకాన్ని సినిమాగా తీశారు. దానికి పెద్ద పేరు, అవార్డూ వచ్చాయి. ఆయనకు విపరీతమైన ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉండేది. నాకు తెలిసిన వారిలో చాలా తక్కువ మంది అంత ఆంగ్ల సాహిత్యం చదివారు. అందుకే ఆయన రచనల్లో తెలుగుదనం ఉంటూనే, విషయం చాలా గొప్పగా ఉంటుంది.
ఆయన ఎప్పుడు చూసినా, ఎప్పుడు పలకరించినా నవ్వుతూ ఉండేవారు. నవ్వులో నిష్కపటత్వం, ఆత్మీయత, సరదా అన్నీ కనిపించేవి. నేను ఆయనతో కలిసి పనిచేసిన 'ఇది పెళ్లి అంటారా'లో ఒక ముఖ్యమైన వేషం వేశారు ఆయన. ఒక శాడిస్ట్ భర్త వేషం అది. ఇలా చేద్దామయ్యా అంటూ, సాధ్యమైనంత వినోదం, శాడిజం ఉండేలా పాత్రను చిత్రించేలా ఆయన ఎంతో తోడ్పాటు అందించారు.
ఇలా నేను ఆయనతో చాలా సినిమాలకు చేశాను. ప్రతి సినిమాలో నేను ఆయన నుంచి సినిమానే కాకుండా, నాటకం గురించి కూడా నేర్చుకున్నాను. ఒక గొప్ప నాటకం ఎలా ఉండాలో చెబుతూ 'వెయిటింగ్ ఫర్ గొడాట్', శామ్యూల్ బకెట్ రాసిన ఇతర డ్రామాల గురించి నాకు వివరించేవారు. ఒక రకంగా చెప్పాలంటే.. మా ఇద్దరి స్నేహంలోనూ ఆయనొక గురువుగా నాకు ఎన్నో తెలియజేసినట్టుగా అనిపిస్తోంది. కనీసం మేమిద్దరం కలసి 10-15 సినిమాలు చేశాం. ఆయనతో ఎప్పుడు గడిపినా నవ్వుతూ ఉండడమే. క్రాంతి కుమార్-చిరంజీవి సినిమాలో ఆయన ఒక వేషం వేశారు. ఊటీలో షూటింగ్. మేమిద్దరం అల్లరి చేస్తుంటే, "మీరిద్దరూ దూరంగా వెళ్లిపోండి, డిస్టర్బ్ అవుతోంది" అని సెట్లోని వారు మాతో అనేవారు. అంత సరదాగా ఉండేవాళ్లం.
చలన చిత్రోత్సవాలు అంటే ఆయనకు విపరీతమైన ఇష్టం. విదేశీ సినిమాలు ఆయన అసలు వదిలేవారు కాదు. అపట్లో సినిమాలు ఇప్పట్లాగా అంత తేలిగ్గా అందుబాటులో ఉండేవి కాదు. మొట్టమొదటిసారి నేను దిల్లీ చలనచిత్రోత్సవానికి వెళ్లాను. నేను జంధ్యాల కలసి వెళ్లాం. అక్కడకు మారుతీరావు కూడా వచ్చారు. అక్కడే నాకు కమల్ హాసన్, సింగీతం శ్రీనివాసరావు ఇలా అందరూ పరిచయమయ్యారు.
మారుతీరావు అందరిలోనూ 'సెంటర్ పాయింట్'గా ఉండి చూసిన సినిమా గురించి అందులో మంచి ఏంటి, చెడ్డ ఏంటి లాంటివి చర్చిస్తూ ఉండేవాళ్లం. నాకు అది ఒక నేర్చుకొనే ప్రక్రియ అయ్యింది. అక్కడి నుంచి త్రివేండ్రం చలనచిత్రోత్సవానికి నేను వెళ్లాను. అక్కడా మారుతీరావు కనిపించారు. నన్ను పిలిచి "నువ్వు ఈ సినిమాలు చూడడం కాదు, అక్కడ కీస్లోవిస్కీ సినిమాలు ఆడుతున్నాయి. వరుసగా ఏడో ఎనిమిదో ఉంటాయి. నువ్వవన్నీ చూసెయ్" అని చెప్పారు. ఆయన వల్ల నాకు ఆ సినిమాలు తెలిశాయి. కొత్త డైరెక్టర్లు తెలిశారు. ఇలా ఉంటాయా అనిపించే కొన్ని గొప్ప గొప్ప 'సిచ్యుయేషన్స్' ఆయన వల్ల చూడగలిగాను.
రావుగోపాలరావు, సత్యనారాయణ సమయాల్లో నెగిటివ్ పాత్రల్లో బాగా కనిపించారు. వ్యక్తిగా ఆయనంత 'ప్లజంట్ పర్సనాలిటీ' చాలా అరుదుగా ఉంటారు. ఎవర్నైనా సరే పది నిమిషాల్లో స్నేహితుడిని చేసేసుకునే మనస్తత్వం, పద్ధతి ఆయనది. నవ్వుతూ మాట్లాడతారు. మనలో సంకోచం, జంకు, బిడియం ఏమున్నా కొన్ని నిమిషాల్లోనే మన తోటివారితో మాట్లాడుతున్నంత సరదాగా మాట్లాడేయగలం. ఆయన తీరు అలా ఉంటుంది. ఏ విషయమైనా అలానే మాట్లాడేస్తారు. నేను వ్యక్తిగా ఆయనంత 'ప్లజంట్ పర్సన్'ను చూడలేదు.
సాయంకాలమైతే ఇంటి దగ్గర కూర్చునే వారు. ఆయన కుమారుడు వాసును డైరెక్టర్ చేయాలని చాలా ఆశ పడేవారు. ఆ అబ్బాయి అకాల మరణం చెందాడు. ఆ అబ్బాయి పేరిట ఏటా అవార్డులు ఇచ్చేవారు. విశాఖపట్నం ఆయన చిన్నప్పటి చోటు. ఎప్పుడూ సముద్రం, బీచ్ గురించి చెబుతుండేవారు. ఆయనా, నేను ఎక్కువ మద్రాసులో బీచ్‌కు వెళ్లి కూర్చునే వాళ్లం. ఆయనకు సముద్రం అంటే ఇష్టం. ఆయన రేడియో స్టేషన్ కిటికీ నుంచి చూస్తే సముద్రం కనిపించేదట. ఆ ఇష్టమే బహుశా ఆయన్ను విశాఖలో స్థిరపడేలా చేసిందనుకుంటాను.
సినిమాకు, సాహిత్యానికి, స్నేహానికి ఎప్పుడూ దగ్గరగానే ఉండేవారు ఆయన. 2000 వరకూ కలుస్తూ ఉండేవాళ్లం. తర్వాత ఆయన విశాఖపట్నం, నేను హైదరాబాద్‌లో ఉండడం, ఆయన మద్రాస్ వెళ్తూ ఉండడం వల్ల కలవడం తగ్గింది. 2004-05లో అనుకుంటా, మళ్లీ గోవా చలనచిత్రోత్సవానికి ఆయన వచ్చారు. అప్పట్నుంచి 2010 వరకు గోవా చలనచిత్రోత్సవానికి కలసి వెళ్లే వాళ్లం. కలుస్తూ ఉండేవాళ్లం. చూసిన సినిమా గురించి బీచ్ దగ్గర కూర్చుని మాట్లాడుకునేవాళ్లం. తరువాత్తర్వాత ఆయన రావడం తగ్గించారు. ఈ మధ్య కలవడం పడలేదు.
ఆయన ఒక తెలుగు చానల్లో కథల గురించి కార్యక్రమం చేశారు. చానళ్లలో వివిధ కార్యక్రమాలు చేశారు. అనుసంధానకర్తగా చర్చలు జరిపారు. సినిమాల్లో నటించారు. రేడియోలో చేశారు. ఎన్నని చెప్పాలి? ఎవరూ చేయనంత సాహిత్య కృషి చేశారు. కారణాలేమైనా, చివరి దశలో క్రమంగా వ్యాపకాలన్నీ తగ్గిస్తూ వచ్చారు. ఇప్పుడా జ్ఞాపకాలన్నీ తల్చుకుంటుంటే ఒక్కొక్కటీ గుర్తొస్తుంది.