క్రీడల్లో మహిళల గురించి భారతీయులు ఏమనుకొంటున్నారు? - బీబీసీ పరిశోధన

శుక్రవారం, 6 మార్చి 2020 (19:10 IST)
క్రీడల్లో పురుషుల్లాగే మహిళలు కూడా రాణిస్తున్నారా? భారత్‌లో బీబీసీ సర్వేలో పాల్గొన్న అనేక మంది దీనికి ఔనని సమాధానమిచ్చారు. క్రీడల్లో మహిళల పట్ల భారతీయుల వైఖరుల గురించి చేసిన ఈ పరిశోధనలో- మహిళా అథ్లెట్లకు పురుషులతో సమానంగా వేతనాలు చెల్లించాలనే వాదనకు అత్యధికులు మద్దతు పలికారు.

 
పురుషుల క్రీడలతో పోలిస్తే మహిళలు పాల్గొనే క్రీడలు అంత వినోదభరితంగా లేవని సర్వేలో పాల్గొన్నవారిలో 42 శాతం మంది అభిప్రాయపడ్డారు. మహిళా క్రీడాకారులు కనిపించే తీరు, వారి సంతానోత్పత్తి సామర్థ్యం గురించి ప్రతికూల ఆలోచనా దృక్పథాలు ఉన్నట్లు కూడా సర్వేలో వెల్లడైంది.

 
14 రాష్ట్రాల్లో 10,181 మందిపై బీబీసీ ఈ సర్వే నిర్వహించింది. మగవారికి, ఆడవారికి క్రీడల ప్రాధాన్యం ఎంత, ఏయే రాష్ట్రాలకు క్రీడల్లో ఎక్కువ ప్రాతినిధ్యం ఉంది, దేశంలో బాగా తెలిసిన అథ్లెట్లు ఎవరు లాంటి ప్రశ్నలకు కూడా ఇందులో సమాధానాలు లభించాయి.

 
లింగ వివక్షే ప్రధాన కారణం
భారత కుర్రాళ్లు క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, సైక్లింగ్, పరుగు పోటీల్లో, ఇతర క్రీడాంశాల్లో పాల్గొంటుండగా, అమ్మాయిలు అన్ని క్రీడల్లో పాల్గొనలేకపోతున్నారు.

 
భారత్‌లో ఉన్న లింగవివక్షే దీనికి ప్రధాన కారణం. సర్వేలో పాల్గొన్న వారిలో మూడో వంతు మంది ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ క్రీడలు మహిళలకు తగినవి కాదని చెప్పారంటే ఇంతకన్నా వేరే కారణం ఏముంటుంది?
 
- గీతా పాండే, బీబీసీ ప్రతినిధి
 
ఆడవారికి సరైనవి కాదని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడిన క్రీడల్లో కుస్తీ, బాక్సింగ్, కబడ్డీ, వెయిట్‌లిఫ్టింగ్ ఉన్నాయి. సర్వేలో వెల్లడైనదాని ప్రకారం మహిళలకు సరిపోయే క్రీడల్లో అథ్లెటిక్స్, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. మూస ఆలోచనాధోరణులను భారత క్రీడాకారిణులు సవాలు చేస్తున్నారు. మహిళలకు 'సరిపోయేవికాదని' ఎంతో మంది భారతీయులు భావించే కుస్తీ, బాక్సింగ్, కబడ్డీ, వెయిట్‌లిఫ్టింగ్‌లలో అంతర్జాతీయ స్థాయిలో వారు రాణిస్తున్నారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి భారత్ గర్వపడేలా చేశారు.

 
భారత్‌లో ఆడేవారు తక్కువే
భారత్‌లో దాదాపు 64 శాతం మంది వయోజనులు ఎలాంటి ఆటలు లేదా శారీరక శ్రమ కలిగే కార్యకలాపాల్లో పాల్గొనడంలేదని అధ్యయనం వెల్లడించింది. స్త్రీ, పురుషుల వారీగా చూస్తే ఈ పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. తాము ఆటలు ఆడామని 42 శాతం మంది మగవారు చెప్పారు. ఇలా చెప్పిన ఆడవారి సంఖ్య కేవలం 29 శాతం. అంటే ఆటలు ఆడిన ఆడవారి శాతం పురుషులతో పోలిస్తే దాదాపు ఒకటిన్నర రెట్లు తక్కువగా ఉంది.

 
వయసును బట్టి చూస్తే ఇందులో మరో ఆసక్తికర కోణం ఉంది. 15-24 ఏళ్ల మధ్య వయసు అబ్బాయిలే క్రీడల్లో అత్యధికంగా పాల్గొంటున్నారు. మరే వయసువారూ ఇంతగా ఆటలు ఆడటం లేదు. ఈ విషయంలో భారత్‌లోని వివిధ రాష్ట్రాల మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.

 
క్రీడల్లో పాల్గొనడంలో తమిళనాడు (మొత్తం జనాభాలో 54%) మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర (మొత్తం జనాభాలో 53%) రెండో స్థానంలో ఉంది. పంజాబ్, హరియాణాల్లో వాటి జనాభాతో పోలిస్తే కేవలం 15% మందే ఆటలు ఆడుతున్నారు.

 
భారత్‌లో ప్రముఖ అథ్లెట్లు ఎవరని అడిగితే...
మీకు తెలిసిన క్రీడాకారుల్లో అత్యున్నతమైనవారు ఎవరని ప్రశ్నిస్తే- వచ్చిన సమాధానం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. అత్యధికులు ప్రఖ్యాత క్రికెటర్ సచిన్ తెందూల్కర్ పేరే చెప్పారు. ఆయన క్రికెట్ నుంచి రిటైర్ అయినా ఆయనే అందరికీ అభిమాన ఆటగాడు.

 
ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, సర్వే చేసిన వారిలో 30 శాతం మంది అసలు ఒక్క క్రీడాకారుడి పేరు కూడా చెప్పలేకపోవడం. 50 శాతం మంది కనీసం ఒక్క క్రీడాకారిణి పేరు కూడా చెప్పలేకపోయారు. అనేక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెల్చుకున్న అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పేరును 18 శాతం మంది చెప్పారు.

 
1970, 1980లలో భారత ట్రాక్ అండ్ ఫీల్డ్‌పై ఆధిపత్యం చలాయించిన పీటీ ఉష ఇప్పటికీ కొంతమంది భారతీయుల మదిలో ఉన్నారు. ప్రస్తుత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు కన్నా ఆమె ఒక్క శాతం మాత్రమే వెనకబడి ఉన్నారు.

 
పురుషులు, మహిళలతో కూడిన ఓ జాబితా నుంచి ఓ అథ్లెట్‌ను ఎంపికచేయాలని అడిగినప్పుడు వచ్చిన ఫలితాలు కొంత భిన్నంగా ఉన్నాయి. దాదాపు 83శాతం మంది అథ్లెట్లను కొంతమేరకు గుర్తించారు. అయితే ఈ ఫలితాలు పురుషులకే ఎక్కువ అనుకూలంగా వచ్చాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు