AIADMK: అన్నాడీఎంకేలో ఏం జరుగుతోంది? పళనిస్వామి, పన్నీర్‌సెల్వం ఘర్షణ వీధుల్లో కొట్టుకునేదాకా ఎందుకు వచ్చింది?

సోమవారం, 11 జులై 2022 (21:09 IST)
ఎంతో చరిత్ర ఉన్న అన్నా డీఎంకే పార్టీ కార్యకర్తలు చెన్నై వీధుల్లో రెండు వర్గాలుగా వీడిపోయి ఒకరినొకరు కొట్టుకున్నారు. ఎంజీఆర్, జయలలిత వంటి బలమైన నేతలు ఒకనాడు నాయకత్వం వహించిన అన్నా డీఎంకే మీద పట్టుకోసం పళనిస్వామి, పన్నీర్‌సెల్వం పోటీ పడ్డారు. ఈ పోటీలో ఎడప్పాడి పళనిస్వామిదే పైచేయి అయింది. నేడు జరిగిన అన్నా డీఎంకే జనరల్ బాడీ సమావేశంలో తాత్కాలిక జనరల్ సెక్రటరీగా పళనిస్వామిని నియమితులయ్యారు. అంతేకాదు పన్నీర్‌సెల్వమ్‌ను పార్టీ నుంచే తీసేశారు.

 
జయలలితకు నమ్మకస్తులే
అన్నా డీఎంకే ఒకనాటి బాస్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఒ.పన్నీర్‌సెల్వం అత్యంత నమ్మకస్తుడు. గతంలో అక్రమాస్తుల కేసుల్లో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు పన్నీర్‌సెల్వమ్‌నే ఆమె సీఎం పీఠం మీద కూర్చోబెట్టారు. అలా 2001లో తొలిసారి, 2014లో రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 2016 డిసెంబరులో జయలలిత చనిపోయినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి అయింది కూడా ఆయనే. ఇక పళనిస్వామి 1980ల నుంచి అన్నా డీఎంకేలో ఉంటూ వస్తున్నారు. 1987లో ఎంజీఆర్ చనిపోయిన తరువాత జయలలిత, జానకీ రామచంద్రన్ మధ్య పార్టీ చీలి పోయింది. నాడు జయలలితకు మద్దతుగా నిలిచారు పళనిస్వామి. అలా జయలలిత అభిమానం చూరగొంటూ మంత్రి స్థాయికి ఆయన ఎదిగారు. 2016లో సేలం జిల్లాలో 11 సీట్లకు గాను 10 సీట్లను అన్నా డీఎంకే గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు పళనిస్వామి. దాంతో ఒక్కసారిగా అటు పార్టీలోనూ ఇటు జయలలిత వద్ద ఆయన పరపతి పెరిగి పోయింది.

 
శశికళ ప్రవేశం
జయలలిత మరణం తరువాత 2016 డిసెంబరు 6న పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత శశికళకు, పన్నీర్‌సెల్వం మధ్య విభేదాలు బయటపడ్డాయి. శశికళను ముఖ్యమంత్రి చేసేందుకు తనను రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఆ తరువాత పార్టీలో విభేదాలు రావడం, శశికళ వర్గం పళనిస్వామిని పార్టీ లెజిస్లేచర్ నాయకునిగా ఎన్నుకోవడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఆ తరువాత పన్నీర్‌సెల్వం రాజీనామా ముఖ్యమంత్రి పదవికి చేయాల్సి వచ్చింది. చివరకు శశికళ అండతో పళనిస్వామి సీఎం అయ్యారు.

 
సంక్షోభాల పర్వం... ముగిసిన శశికళ అధ్యాయం
డీఎంకే నుంచి బయటకు వచ్చి 1972లో అన్నా డీఎంకేను స్థాపించారు ఎంజీఆర్. నటునిగా తిరుగులేని ప్రజాకర్షణ ఆయన సొంతం. ప్రజాభిమానం తెచ్చిన బలంతో పార్టీ మీద ఎంజీఆర్ పూర్తి పట్టు సాధించగలిగారు. కానీ 1987లో అకస్మాత్తుగా ఎంజీఆర్ చనిపోయారు. దాంతో పార్టీ రెండుగా చీలి పోయింది. ఒకటి ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్ వర్గం కాగా మరొకటి సినీనటి జయలలిత వర్గం. ఆ పోరులో గెలిచిన జయలలిత, అన్నా డీఎంకే అధినేత్రిగా మారారు. సుమారు 28 ఏళ్లు ఆ పార్టీలో తిరుగులేని నాయకురాలిగా అధికారం చలాయించారు. చివరకు 2016లో చనిపోవడంతో జయలలిత స్నేహితురాలు వీకే శశికళ అన్నా డీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీ అయ్యారు. ఆమె ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు. కానీ అంతలోనే అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లారు. ఆ తరువాత అన్నా డీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీ పదవి నుంచి ఆమెను తొలగించారు.

 
ఓపీఎస్, ఈపీఎస్‌ల జుగల్బందీ
పళనిస్వామితో మళ్లీ చేతులు కలిపిన పన్నీర్ సెల్వం, 2017 డిసెంబరు 21న తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. అలాగే అన్నా డీఎంకే పార్టీకి కో-ఆర్డినేటర్‌గా ఒ.పన్నీర్‌సెల్వం(ఓపీఎస్) నియమితులు కాగా ఎడప్పాడి కే పళనిస్వామి(ఈపీఎస్) జాయింట్ కో-ఆర్డినేటర్ అయ్యారు. నాటి నుంచి ఇద్దరి నాయకత్వంలో అన్నా డీఎంకే నడుస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఓపీఎస్, ఈపీఎస్ కలిశారో వారు శశికళకు దూరంగా జరిగారు.

 
ఇద్దరి నాయకుల నేతృత్వంలో నడవడం అన్నా డీఎంకేకు సవాలుగా మారింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం తరువాత పార్టీలో విభేదాలు మరింత పెరిగాయి. అసెంబ్లీలో ఎవరు ప్రతిపక్షనేతగా ఉండాలనే వివాదం తలెత్తింది. చివరకు పళనిస్వామి ఆ పదవిని చేజిక్కించుకున్నారు. గత కొద్ది నెలలుగా పార్టీలో ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల మధ్య పోరు ఎక్కువ అయింది. పార్టీకి ఒక్కరే నాయకత్వం వహించాలనే డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది జూన్ నుంచి పళనిస్వామి వర్గం మాత్రమే ఏక నాయకత్వం కోసం పట్టుపడుతూ వచ్చింది. కానీ పన్నీర్‌సెల్వం వర్గం దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ ఘర్షణల మధ్య జిల్లా స్థాయి నేతలను ఈపీఎస్, ఓపీఎస్ ఆకర్షించడం మొదలు పెట్టారు. ఇందులో పళనిస్వామి పైచేయి సాధించారు.

 
అన్నా డీఎంకే జనరల్ బాడీ సమావేశం
ఈ ఘర్షణల మధ్యే జూన్ 23న అన్నా డీఎంకే జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీకి ఒక నాయకత్వమే ఉండాలంటూ ఈ సమావేశంలో నిర్ణయిస్తామని పళనిస్వామి వర్గం చెప్పుకొచ్చింది. దీంతో జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించకుండా ఆపాలంటూ కొందరు అన్నా డీఎంకే సభ్యులు మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. కానీ సమావేశాన్ని ఆపడానికి కోర్టు అంగీకరించలేదు. అనుకున్నట్లుగా జనరల్ బాడీ సమావేశం ప్రారంభం కావడం, ఏక నాయకత్వం కావాలంటూ తీర్మానం చేయడం జరిగిపోయింది. దీంతో సమావేశం మధ్యలోనే పన్నీర్‌సెల్వం వెళ్లిపోయారు. జులై 11న రెండోసారి జనరల్ బాడీ సమావేశమవుతుందని నాడు పళనిస్వామి ప్రకటించారు. కానీ ఆ సమావేశం జరపకుండా ఆపాలంటూ పన్నీర్‌సెల్వం వర్గం కోర్టుకు వెళ్లింది. కానీ మళ్లీ తీర్పు పళనిస్వామికే అనుకూలంగా వచ్చింది.

 
వీధిలో కొట్లాట
జులై 11 అంటే సోమవారం ఉదయం మద్రాస్ హై కోర్టు అన్నా డీఎంకే జనరల్ బాడీ సమావేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత చెన్నైలోని పార్టీ కార్యాలయం వద్దకు తన అనుచరులతో వచ్చారు పన్నీర్‌సెల్వం. అప్పటికే పళనిస్వామి వర్గం అక్కడ ఉంది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలై వీధుల్లో కొట్టుకున్నారు. రాళ్లు విసురుకున్నారు. సోమవారం నాటి జనరల్ బాడీ సమావేశంలో అన్నా డీఎంకే పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా పళనిస్వామిని ఎన్నుకుంటున్నట్లు ప్రకటించారు. ఇది పార్టీలోనే శక్తివంతమైన పోస్టు. చనిపోయే వరకు జయలలిత ఆ పదవిలో ఉన్నారు. ఆ తరువాత కూడా జయలలితనే శాశ్వత జనరల్ సెక్రటరీగా ఉంటారని పార్టీ చెబుతూ వచ్చింది. కానీ పళనిస్వామిని ఎన్నుకోవడం ద్వారా ఆ వైఖరి మారినట్లు అయింది. పార్టీకి వ్యతిరేకంగా పని చేశారంటూ ఇదే సమావేశంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్‌సెల్వామ్‌ను తొలగించారు. కానీ తనను తొలగించే అధికారం పళనిస్వామికి లేదని తానే పార్టీ నుంచి ఆయనను తొలగిస్తున్నట్లు పన్నీర్‌సెల్వం ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు