పెద్దనోట్ల రద్దు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం: ఎద్దేవా చేసిన పి. చిదంబరం

సోమవారం, 30 జనవరి 2017 (06:04 IST)
పెద్దనోట్ల రద్దు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిందంబరం అన్నారు.  ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ.. ఇది నోట్ల రద్దు కాదని, పునర్‌ముద్రణ మాత్రమే అని ఎద్దేవా చేశారు. తాను ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పడు ప్రధాని తీసుకున్నట్టుగా నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకుని ఉంటే పదవికి రాజీనామా చేసేవాడినని చెప్పారు. 
 
నోట్లరద్దుతో 45 కోట్ల మంది కూలీలు జీవనోపాధి కోల్పోయి 50 రోజులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, రోజూ 10 కోట్ల మంది ఏటీఎంల ముందు నానా యాతన అనుభవించారని చిదంబరం పేర్కొన్నారు. అయినా కేంద్రం నష్టపరిహారం మాటే ఎత్తడం లేదన్నారు. మహానగరాల ఏటీఎంలలో డబ్బులను చూసి అంచనాకు రావద్దని, దేశంలో సగం ఏటీఎంలు ఖాళీగా ఉన్నాయని, గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు నగదు చేరలేదని పేర్కొన్నారు. రద్దైన నోట్ల స్థానంలో కొత్త నోట్ల ముద్రణకు కనీసం 8 నెలలు పడుతుందని, మే చివరి నాటికి కూడా కరెన్సీ కొరత తీరదన్నారు. దేశంలో సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతాయని, నగదు రహితానికి మారితే పేటీఎం వంటి ఈ–వాలెట్‌ సంస్థలు రోజూ రూ.1,500 కోట్ల లబ్ధి పొందుతాయని చెప్పారు. 
 
నోట్ల రద్దు విషయంలో ఆర్బీఐ పాత్రను కేంద్రమే పోషించిందని, దీంతో ఆర్బీఐ స్వయంప్రతిపత్తి ప్రమాదంలో పడిందని చిదంబరం పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్‌ మంత్రులను హడావుడిగా సమావేశానికి పిలిచి నోట్ల రద్దుపై ప్రకటన చేస్తున్నామని ప్రధాని తెలిపారని, ఆ ప్రకటన ముగిసే వరకు గంటపాటు వారిని, ఆర్బీఐ గవర్నర్‌ను నిర్బంధంలో ఉంచారన్నారు. కేవలం ఇద్దరు, ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లతోనే ఆర్బీఐ తూతూమంత్రంగా సమావేశం నిర్వహించిందని, 8 మంది డైరెక్టర్లు హాజరు కాలేదన్నారు.
 
పెద్దనోట్ల రద్దుతో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు ఒక శాతం పడిపోయిందని, దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.1.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని చిదంబరం అన్నారు. దేశ ఆర్థికాభివృద్ధి సగానికి పడిపోయిందని, మళ్లీ కోలుకోవడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని చెప్పారు. ‘‘నోట్లరద్దు అత్యంత అనాలోచిత, తెలివి తక్కువ నిర్ణయం. సుమారు 4 కోట్ల మంది నల్ల కుబేరులు తమ నల్లధనాన్ని మార్పిడి చేసుకోలేరని ఆశించి ప్రభుత్వం భంగపడింది. రూ.15,44,000 కోట్లు విలువ చేసే నోట్లను రద్దు చేస్తే దాదాపు నోట్లన్నీ తిరిగి బ్యాంకుల్లో జమయ్యాయి. నేపాల్, భుటాన్, ఎన్నారైల వద్ద ఉన్న నోట్లు వస్తే రద్దయిన నోట్లన్నీ జమైనట్లే. ఇదంతా కేవలం నోట్ల పునఃముద్రణ, నోట్ల మార్పిడిగా మారింది’’ అని అన్నారు.  
 
నల్లధనం, అవినీతి, నకిలీ నోట్లు, ఉగ్రవాదం నిర్మూలనకే నోట్ల రద్దు అని కేంద్రం చెప్పుకున్న లక్ష్యాలు ఏమాత్రం నెరవేరలేదన్నారు. పైగా బ్యాంకర్ల అవినీతి, అక్రమాలు పెచ్చరిల్లి కొత్త అవినీతి, నల్లధనం పుట్టుకొచ్చిందన్నారు. ఉగ్రవాదం కూడా తగ్గలేదని, బారాముల్లాలో హతమైన ఉగ్రవాది వద్ద కొత్త రూ.2 వేల నోట్లు లభించాయన్నారు. అవినీతి, లంచాల డిమాండ్‌ను నిర్మూలిస్తేనే నల్లధనానికి చెక్‌పెట్టడడం సాధ్యమవుతుందన్నారు. 
 

వెబ్దునియా పై చదవండి