చైనా మొబైల్ మార్కెట్‌పై కరోనా వైరస్ పంజా విసిరింది. ఫలితంగా మొబైల్ మార్కెట్ కుదేలైపోయింది. చైనా నుంచి దిగుమతి అయ్యే అన్ని మొబైల్స్ పూర్తిగా ఆగిపోయాయి. అలాగే, చైనా ఆటో మొబైల్ ఇండస్ట్రీస్‌పై కూడా దీని ప్రభావం గణనీయంగా ఉంది. ఈ సీజన్‌లో కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ చైనానే. అలాంటిది ఈ సీజనులో కేవలం 4,909 కార్లు మాత్రమే విక్రయించారు. గతేడాది ఇదే సీజన్‌లో 59,930 కార్లు అమ్మారు. అంటే దాదాపు 92 శాతం మేరకు విక్రయాలు పడిపోయాయి. చైనాలో ప్రస్తుత పరిస్థితికి ఈ గణాంకాలే అద్దం పడుతున్నాయి.
అంతేకాదు, కొన్నివారాలుగా చైనాలో ఆర్థిక పరిస్థితి మందగమనంలో సాగుతోంది. ముఖ్యంగా అక్కడి ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలైంది. కరోనా వైరస్ కు భయపడి షోరూంలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరో కొద్దిమంది ధైర్యం చేసి షోరూంలు తెరిచినా వారి వద్ద కార్లు కొనేందుకు వచ్చే కస్టమర్ల సంఖ్య చేతి వేళ్ళపై లెక్కించేలా ఉంది.
అటు, చైనాలో వాహన తయారీ సంస్థలు కూడా ఉత్పత్తి నిలిపివేశాయి. వాహన విడిభాగాల పరిశ్రమ పైనా కరోనా ప్రభావం తక్కువేమీ లేదు. ప్రపంచదేశాల మార్కెట్లకు వాహనాల స్పేర్ పార్టులు ఎగుమతి చేసే దేశాల్లో చైనా కూడా ఉంది. ఇప్పుడక్కడి నుంచి వాహన విడిభాగాల సరఫరా క్షీణించడంతో అది ఇతర దేశాల మార్కెట్లను కూడా గణనీయంగా దెబ్బతీస్తుందని అంచనా వేస్తున్నారు.