దేశంలో పెట్రోల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే, కేవలం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు మాత్రమే పెరుగుతున్నాయని అనుకుంటే పొరబడినట్టే. ఇప్పుడు సీఎన్జీ, పీఎన్జీ కూడా మరింత ప్రియం అయ్యింది.
కాగా, వంట గ్యాస్ వినియోగదారుల నడ్డివిరిచేలా చమురు సంస్థలు ధరలు పెంచుతూనే ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా నాలుగుసార్లు సిలిండర్ ధర పెరగటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం సిలిండర్ ధర మరో రూ.25 పెరిగింది.
దీంతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.846.50 నుంచి రూ.871.50కి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ ఇవ్వకపోవడంతో వినియోగదారులు మొత్తం ధర చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి వస్తుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక ఫిబ్రవరిలో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.100 పెరిగింది. మార్చి ఒకటిన పెరిగిన ధరతో ఇది రూ.125కు చేరింది.