జియో టెలికాం సేవలు.. ఇకపై జియో కిరాణా షాపులు

శుక్రవారం, 17 నవంబరు 2017 (09:29 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే అనేక వ్యాపారాలు కలిగివున్న ఆయన.. గత యేడాది టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన విషయంతెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరో వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నారు. ఆ వ్యాపారం ఏంటో కాదు.. జియో ఆన్‌లైన్ కిరాణా స్టోర్స్. తద్వారా ఈ-కామర్స్ సైట్లకు షాకివ్వాలని భావిస్తున్నారు. 
 
దేశ రిటైల్ ఇండస్ట్రీలో 88 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న కిరాణా షాపుల ద్వారా జియో కిరాణా సరకుల రంగంలోనూ తనదైన ముద్ర వేసేందుకు సన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే త్వరలో జియో కిరాణా పేరిట రిటైల్ సేవలను తన టెలికాం కస్టమర్లకు అందించనుంది.
 
జియో కిరాణాకు చెందిన సేవలు పైలట్ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌లో ప్రారంభమయ్యాయి. జియో ప్రస్తుతం ఈ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. వచ్చే ఏడాదిలో జియో కిరాణా సేవలను ప్రారంభించాలని ఇప్పటి నుంచి ప్రణాళికలను రూపొందిస్తోంది.
 
జియో కిరాణా సేవలను అందుబాటులోకి తెస్తే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఆన్‌లైన్‌లో కిరాణా సరకులు అందిస్తున్న ఇతర ఈ-కామర్స్ సంస్థలు, పేటీఎం, మొబిక్విక్ వంటి డిజిటల్ వాలెట్ సంస్థలకు పెద్ద దెబ్బే ఎదురవుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు