చక్రవడ్డీ మాఫీ... చెల్లించినవారికి రీయింబర్స్‌మెంట్ : కేంద్రం వెల్లడి

ఆదివారం, 25 అక్టోబరు 2020 (13:19 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్రం దేశంలో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేసింది. ఈ లాక్డౌన్ మార్చి మూడో వారం నుంచి ప్రారంభమైంది.  దీంతో అనేకమంది ఉపాధి కోల్పోయారు. ఫలితంగా బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలలో రుణాలు తీసుకున్నావారు ఈఎంఐలు చెల్లించలేకపోయారు. దీంతో మార్చి నుంచి ఆగస్టు వరకు వివిధ రకాల రుణాల ఈఎంఐలపై మారటోరియంను కేంద్రం విధించింది. ఈ సమయంలో రుణాలు చెల్లించని వారి నుంచి బ్యాంకులు వడ్డీతో పాటు చక్రవడ్డీని వసూలు చేశాయి. ఈ అంశం సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో రుణ గ్రహీతలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తేల్చింది. పైగా, లాక్డౌన్ అమలు చేసింది కేంద్రం.. సమస్యను పరిష్కరించాల్సింది కూడా కేంద్రమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
 
దీంతో కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చింది. మార్చి నుంచి ఆగస్టు వరకూ వివిధ రకాల రుణాల ఈఎంఐలను మారటోరియంలో భాగంగా చెల్లించని రుణ గ్రహీతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్న వారి ఈఎంఐలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నామని ప్రకటించింది. ఇది విద్య, వాహన, వ్యక్తిగత, గృహ రుణాలతో పాటు క్రెడిట్ కార్డు బకాయిలు, ఎంఎస్ఎంఈలకు వర్తిస్తుందని తెలిపింది. 
 
ఇదిలావుండగా, ఈ నెల 14వ తేదీన చక్రవడ్డీ మాఫీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, సామాన్యుడు దీపావళి పండగను చేసుకోవడం కేంద్రం చేతుల్లోనే ఉందని, వడ్డీపై వడ్డీని వేయాలన్న యోచన తగదని వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, మారటోరియం సమయంలో ఈఎంఐలు చెల్లించిన వారు, ఆయా వివరాలతో కేంద్రం నుంచి రీయింబర్స్‌మెంట్‌ను పొంది ఉపశమనం పొందవచ్చని కూడా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు