ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలే ఉద్యోగాలు!!!

శుక్రవారం, 2 ఏప్రియల్ 2010 (16:10 IST)
FILE
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలు విరివిగా లభించనున్నాయి. ఇందులో భాగంగా గ్రామీణ, నగర, పట్టణ ప్రాంతాలలో పలు రంగాలలో ఉద్యోగాలు దొరకనున్నట్లు ఇటీవల నిర్వహించిన ఓ సర్వే తెలిపింది. భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ) 15 వేల బిజినెస్ కరస్పాండెంట్లను నియమిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అదే విధంగా భెల్ సంస్థ నాలుగు వేలమందిని నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు ఆ సంస్థ ఇటీవలే ప్రకటించింది. ఇదే సంస్థ నిరుడు 3,500 మంది కార్మికలును నియమించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ కంపెనీలు విరివిగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్ధంగానున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ, సేవారంగాలను విస్తరించే దిశలో భాగంగా అమెరికాకు చెందిన కంపెనీ సన్మినా-ఎస్‌సీఐ కార్పోరేషన్ వచ్చే ఐదు సంవత్సరాలలో 8,500 మందిని నియమించనున్నట్లు ప్రకటించింది. సదరు కంపెనీ చెన్నైలోని కర్మాగారంలో నియమించనుంది. ప్రస్తుతం ఈ కంపెనీలో 1,500 మంది మాత్రమే పనిచేస్తుండటం గమనార్హం.

బ్యాంకులకు చెందిన పలు శాఖలను గ్రామీణ ప్రాంతాలలో ప్రారంభించడం వీలుకాదని, దీనికి ప్రత్యామ్నాయంగా తమ బ్యాంకు 15 వేలమంది బిజినెస్ కరస్పాండెంట్లను నియమిస్తుందని భారతీయ స్టేట్ బ్యాంకు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో తమ బ్యాంకు సేవలను గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు అందజేసేందుకు బిజినెస్ కరస్పాండెంట్లు సహకరిస్తారని, వీరు ఖాతాను తెరిచి అందులో తమ సొమ్మును జమ చేయడం, సొమ్మును తీసుకునే సౌకర్యాలను ప్రజలకు వివరించి వారికి సహాయపడతారని ఆ అధికారి వెల్లడించారు. దీనికిగాను వారికి కమీషన్ ఇచ్చేందుకు తమ బ్యాంకు నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే దేశంలోని ఇతర బ్యాంకులు కూడా 12 లక్షల మంది బిజినెస్ కరస్పాండెంట్లను నియమించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు సమాచారం.

భెల్ సంస్థ ఉద్యోగులను నియమిస్తుందని ప్రకటించిన నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్ అనిల్ సచ్‌దేవ్ మీడియాతో మాట్లాడుతూ 11వ, 121వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా 1.80 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామన్నారు. ఇదిలావుండగా తమ సంస్థకు పలు కంపెనీల నుంచి భారీగా ఆర్డర్లు వస్తున్నాయన్నారు. ఇలాంటి సందర్భంలో తాము అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడు సంవత్సరాలలో విద్యుత్ రంగంలో అధిక సంఖ్యలో ఉద్యోగావకాశాలు రానున్నాయని ఆయన అన్నారు. దీనికిగాను విద్యుత్ రంగంలో ఏడున్నర లక్షలమంది ఉద్యోగుల అవసరం ఏర్పడుతుందన్నారు.

వెబ్దునియా పై చదవండి