ప్రభుత్వ కంపెనీల్లో ఉద్యోగాలే...ఉద్యోగాలు!!

సోమవారం, 3 మే 2010 (12:35 IST)
స్వచ్ఛంద పదవీ విరమణ ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రభుత్వరంగానికి చెందిన పలు కంపెనీల్లో ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఉద్యోగుల కొరత ఏర్పడటంతో దాదాపు 31 వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ వర్గాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా నియామకాలు చేపడితే గతంలో (2007-08) ఉన్న ఉద్యోగుల సంఖ్య 15.66 లక్షలకు చేరుకుంటుందని ప్రభుత్వ ఉన్నతాధికారి భాస్కర్ ఛటర్జీ తెలిపారు. ప్రభుత్వ కంపెనీల్లో స్వచ్ఛంద పదవీ విరమణగావించిన ఉద్యోగులు, వేరే కంపెనీలకు డిప్యూటేషన్లపై వెళ్ళిన వారి సంఖ్య ఎక్కువవ్వడంతో వీరి స్థానంలో నిరుద్యోగులను భర్తీ చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేస్తోందని ఆయన తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వానికి చెందిన కంపెనీల్లో ఎవ్వరినీ ఉద్యోగాల్లోనుంచి తొలగించలేదన్నారు. ప్రైవేట్ కంపెనీల్లోలాగా కంపెనీలను వదిలి వెళ్ళమని ప్రభుత్వం సూచించలేదని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగానున్న ప్రభుత్వరంగానికి చెందిన దాదాపు 246 కంపెనీల్లో 2007-08 నాటికి 15.66 లక్షల మంది ఉద్యోగులున్నారు. అదే 2008-09 నాటికి వీరి సంఖ్య 15.35 లక్షలకు చేరుకుందని ఆయన వివరించారు.

కేంద్ర ప్రభుత్వం గతంలో స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్)ను ప్రకటించడంతో 1988 నుంచి 2009 మార్చి చివరి వరకు ప్రభుత్వరంగానికి చెందిన ఉద్యోగులు దాదాపు 6.1 లక్షల మంది వీఆర్ఎస్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి