జైల్లో ఉన్నా తగ్గని శశికళ క్రిమినల్ మైండ్.. తమిళనాడు గాలి జనార్దన్ రెడ్డి.. దినకరన్

మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (04:47 IST)
అక్రమ సంపాదనను తన కింద వేసుకుని ఊరేగడానికి గాలి జనార్దన్ రెడ్డి న్యాయమూర్తులకే కోట్ల లంచం ఎరగా వేసి న్యాయవ్యవస్థను ఎంతగా గబ్బు పట్టించాలని చూశాడో మనందరికీ తెలుసు. ఇప్పుడు అంతకుమించిన ఘాతుకానికి తమిళనాడు జనార్దన్ రెడ్డి.. శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్ సాహసించాడు. అన్నాడిఎంకే అధికార చిహ్నమైన రెండాకులను సొంతం చేసుకోవడానికి సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్నే కోట్లతో కొనుగోలు చేయాలని ప్రయత్నించిన దినకరన్ అడ్డంగా బుక్కయిన ఘటన రాజకీయ వర్గాలను నివ్వెరపర్చింది. 
 
రోజుకోమలుపు తిరుగుతున్నాయి తమిళనాడులో శశికళ వర్గానికి తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ గుర్తు కోసం ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి అన్నాడీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ దినకరన్‌ బుక్కయ్యారు. ఆయనపై ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు ఆకులు అన్నాడీఎంకే పార్టీ గుర్తు అనే విషయం తెలిసిందే. దీనికోసం పన్నీర్‌ వర్గం, శశికళ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారు లాబీయింగ్‌లు చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో అన్నాడిఎంకే అధికార చిహ్నం రెండాకుల గుర్తు తమకే వచ్చేలా చూడాలని చెప్పి దినకరన్‌ ఏకంగా ఆ రూ.50కోట్ల ఒప్పంద చేసుకొని సుఖేశ్‌ చంద్ర అనే మధ్యవర్తి ద్వారా ఈసీకి లంచం ముట్టజెప్పేందుకు ప్రయత్నం చేశారని తాజాగా అభియోగాలు నమోదయ్యాయి. ఇప్పటికే సుఖేశ్‌ చంద్రకు రూ.కోటి 39లక్షలు ముట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వ్యక్తి పోలీసుల చేతికి చిక్కడంతో ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. అతడి వద్ద నుంచి రూ.కోటి 39లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
 
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బతికి ఉన్నప్పుడే క్రిమినల్ మైండ్‌తో రాజకీయాలు ప్లే చేసిన శశికళ తన మేనల్లుడు దినకరన్ చేత ఎంత నైచ్యానికి దిగజారిందో అర్థమై తమిళనాడు భగభగ మంటోంది. ఇప్పటికే ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల సంబంధించి పెద్ద మొత్తంలో ఓటర్లను ప్రభావితం చేశారని దినకరన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా తన పని ఇక ముగిసినట్లేనని అర్థమైన దినకరన్‌ కర్నాటక జైలులోని శశికళను కలిసి భవిష్యత్తుపై చర్చలు జరపనున్నట్లు సమాచారం.
 

వెబ్దునియా పై చదవండి