జయ ఎస్టేట్‌లో 200 కోట్లు కొత్త నోట్లు.. దానికే వరస హత్యలు.. నిజమేనా?

ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (05:54 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కొడనాడులో ఉన్న ఎస్టేట్‌లో రూ. 200 కోట్ల కొత్త నోట్లను దాచారా.. ఈ భారీ మొత్తాన్ని కొల్లగొట్టడానికే ఆ ఎస్టేట్‌పై దాడులు, దహనం, వరుస హత్యలు జరుగుతున్నాయా? తిరుచ్చూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారినుంచి సేకరించిన సమాచారం, తదనంతర విచారణలో ఈ దోపిడీ వ్యవహారం మొత్తంగా బయటపడినట్లు విశ్వసనీయ సమాచారం. పైగా ఈ పథకంలో కోయంబత్తూరుకు చెందిన అన్నాడీఎంకే ప్రముఖుడి హస్తం ఉన్నట్లు తెలుస్తుండటంతో  ఈ కేసు విచారణపై తమిళనాడులో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి ఎస్టేట్‌లో ఇంత భారీ మొత్తం నగదు ఉన్నట్లు పుకార్లు రావడం. పోలీసుల విచారణ వరకూ వెళ్లి కొత్త అంశాలు బయటపడుతుండటం తమిళనాడుకు ఇప్పుడు షాకింగ్ న్యూస్.
 
వివరాల్లోకి వెళితే. కొడనాడులో రూ.200 కోట్లు కొత్త నోట్లు ఉన్నట్టు, వాటి దోపిడీ లక్ష్యంగా వ్యూహ రచన జరిగినట్టు కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. తిరుచ్చూర్‌లో తొలుత ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని చేపట్టిన విచారణలో ఈ దోపిడీ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఈ పథకంలో కోయంబత్తూరుకు చెందిన అన్నాడీఎంకే ప్రముఖుడి హస్తం ఉన్నట్టు తెలిసింది. 
 
ఈ నేపథ్యంలోనే జయ మాజీ డ్రైవర్ కనకరాజ్‌కు పూర్తిగా ఎస్టేట్‌ గురించి తెలిసి ఉండడంతో అతడి సహకారంతో దోపిడీకి ప్రయత్నించిన సమయంలో సెక్యూరిటీ అడ్డుకోవడం, వారి మీద దాడి చేయక తప్పలేదని పట్టుబడ్డ వారు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో వరుసగా ఘటనలో సాగుతుండడంతో అమ్మ ఆత్మ కొడనాడులో సంచరిస్తున్నట్టు, బలి తీసుకుంటున్నట్టు అక్కడి గ్రామాల్లో కొత్త ప్రచారం ఊపందుకోవడం గమనార్హం.
 

వెబ్దునియా పై చదవండి