గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా అస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ ఉంగలుక్కాగ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సునీల్ స్థానిక టీ నగర్‌లోని గురు రాఘవేంద్ర సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు వెయ్యి మందికి అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ మాట్లాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావాలని కోరుకున్నారు. అంతేకాకుండా, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు ఉండాలని, తమిళనాడు రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచేలా పాలన సాగించాలని, ఇందుకోసం అమ్మకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీగురు రాఘవేంద్ర స్వామిని వేడుకున్నట్టు తెలిపారు.
కాగా, ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీల్‌తో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ చక్రవర్తి ఆవుల, ఆస్కా కమిటీ సభ్యులు దువ్వూరు సురేష్ రెడ్డి, కోడై చంద్ర, అంబేద్కర్ జననాయక పేరవై కార్యదర్శి జి ప్రభాకర్, ఆడిటర్ రవిచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.